మావోలకు మరో ఎదురు దెబ్బ

28 Apr, 2018 01:22 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోల మృతదేహాలు

బిజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సల్స్‌ మృతి

చర్ల/మల్కన్‌గిరి: మావోయిస్టులు వరుస నష్టాలు చవిచూస్తున్నారు. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన సందర్భంగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసు యంత్రాంగం.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేపట్టారు.

శుక్రవారం ఉదయం బిజాపూర్‌ జిల్లా ధర్మతాళ్లగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మరిమల అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్‌ బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో .. ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళా మావోయిస్టులు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. ఘటన స్థలం నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్, రివాల్వర్‌తోపాటు నాలుగు ఎస్‌బీబీఎస్‌ తుపాకులు, ఆరు రాకెట్‌ లాంచర్లు, ఆరు గ్రనేడ్లు, పది కిట్‌ బ్యాగులు, నాలుగు జతల ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను హెలికాప్టర్‌లో బిజాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. గాలింపు చర్యల్లో తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు