మొన్న చిన్నాన్న, నిన్న అక్క కుమార్తె

15 Jul, 2014 07:55 IST|Sakshi
మొన్న చిన్నాన్న, నిన్న అక్క కుమార్తె

- రితిభ హంతకుడి కొత్త కోణం
- 2013లో చిన్నాన్నను హత్య చేసిన సల్మాన్
- పోలీసుల దర్యాప్తులో బయటపడిన వాస్తవాలు
- డబ్బు కోసం నేరాలు
- పోలీస్ కమిషనర్ ఔరాద్కర్


 బెంగళూరు : ఐదురోజుల క్రితం సొంత అక్క కుమార్తెను   డబ్బు కోసం కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన సల్మాన్‌ను విచారణ చేసిన పోలీసులకు మరో హత్య విషయం వెలుగు చూడటంతో కంగుతిన్నారు. నిందితుడు సొంత చిన్నాన్ననే హత్య చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 9న సొంత అక్క కుమార్తె రితిభను కిడ్నాప్ చేసిన నిందితుడు సల్మాన్ తన భార్య షబరీన్‌తో కలిసి సొంత చిన్నాన్న హఫీజ్ శంషుల్‌ను హత్య చేశాడని ఔరాద్కర్ వివ రించారు.

వివరాలు... హతుడు హఫీజ్ ఓ ఉర్ధూ వార పత్రిక ఎడిటర్. ఈయనకు ట్యాన రీ రోడ్డులోని ఈద్గా కాంప్లెక్స్‌లో ఆల్ ఖుద్దున్ మైనార్టీ కో-ఆపరేటివ్ సొసైటీ కూడా ఉంది. ఇదిలా ఉంటే హఫీజ్‌కు వరుసకు కుమారుడైన సల్మాన్ 2010లో నగరానికి చెందిన షబరిన్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం అక్కడే కొన్నాళ్లు ఉండి బెంగళూరు చేరుకున్నాడు.
 
షబరిన్ తల్లి ఇంటిలోనే కాపురం పెట్టారు. జులాయిగా తిరుగుతున్న సల్మాన్ వ్యవహారం నచ్చక అత్త కుమార్తెతో పాటు అల్లుడిని కూడా బయటకు పంపింది. దీంతో వీరు శివాజీనగర్‌లో నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఇంటి ఖర్చుల కోసం   చిన్నాన్న హఫీజ్ వద్దకు వచ్చేవాడు.  చిన్నాన్న వద్ద డబ్బు అధికంగా ఉందని భావించిన సల్మాన్ అతడిని హత్య చేయాలని పథకం వేశాడు. ఇందుకు భార్యకు కూడా సహకరించడంతో 2013 జూన్ 3న ఉదయం 7 గంటల సమయంలో హఫీజ్ సొసైటీ కార్యాలయంలో ఉండగా అప్పటికే అక్కడికి చేరుకున్న సల్మాన్ దంపతులు డబ్బు కావాలని హఫీజ్‌ను డిమాండ్ చేశారు.

అతను నిరాకరించడంతో కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం బీరువాలో ఉన్న రూ. 60 వేల న గదు ఎత్తుకెళ్లారు. పోలీసుల చిక్కిపోతామని భావించి హైదరాబాద్ చేరుకున్నారు. హఫీజ్ హత్య కేసులో పోలీసులు 127 మందిని విచారణ చేశారు. అయినా నిందితులు చిక్కలేదు. ఇదే అదునుగా భావించిన సల్మాన్ భార్యతో సహా బెంగళూరు చేరుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సల్మాన్ డబ్బు కోసం చివరకు అక్క కుమార్తెను హత్య చేసి పోలీసుల విచారణలో చిన్నాన్న హఫీజ్‌ను కూడా హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని ఔరాద్కర్ చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను రాఘవేంద్ర ఔరాద్కర్ అభినందించారు.  

మరిన్ని వార్తలు