ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్‌జేఎం లేఖ

19 Feb, 2019 14:57 IST|Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో చైనా యాప్‌లను, ఇ- కామర్స్‌ యాప్‌లను, చైనీస్‌ టెలికాం ఎక్విప్‌మెంట్‌ను వెంటనే నిషేధించాలని కోరుతూ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా సహకరించే దేశాలకు ఆర్థికంగా లబ్ది చేకూర్చడం సబబు కాదని లేఖలో పేర్కొంది. ఈ విషయంలో ప్రతీ భారతీయుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వచ్ఛందంగా చైనా యాప్‌లను విడనాడాలని పిలుపునిచ్చింది.

వాటిని స్వాగతిస్తున్నాం..
‘పాకిస్తాన్‌కు మోస్ట్‌ ఫేవర్డ్‌ స్టేటస్‌ను భారత ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. పాక్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్‌ డ్యూటీని పెంచడం ద్వారా సరైన నిర్ణయమే తీసుకున్నారు. అదేవిధంగా మనకు తరచుగా హాని కలిగిస్తున్న వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్న చైనా పట్ల కూడా ఇదే వైఖరి అవలంభించాలి’ అని ఎస్‌జేఎమ్‌ కో కన్వీనర్‌ అశ్వానీ మహాజన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా రక్షణా పరంగా మనకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే చైనా యాప్‌లను తక్షణమే తొలగించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ క్రమంలో 2017, డిసెంబరులో భద్రతా బలగాల అధికారుల ఫోన్లలో ఉన్న 42 రకాల చైనీస్‌ యాప్‌లను తొలగించాల్సిందిగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.(జైషే చీఫ్‌పై మారని చైనా తీరు)

కాగా పుల్వామా ఉగ్రదాడిని చైనా ఖండించినప్పటికీ.. ఆ దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఐరాస భద్రతా మండలిలో మోకాలు అడ్డుతున్న విషయం తెలిసిందే.  తద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు చైనా అండగా నిలుస్తోందన్న విషయం బహిరంగ రహస్యమే.  

మరిన్ని వార్తలు