ఈడీ కొత్త చీఫ్‌గా ఎస్‌కే మిశ్రా

28 Oct, 2018 04:16 IST|Sakshi
సంజయ్‌కుమార్‌ మిశ్రా

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కొత్త అధిపతిగా సంజయ్‌కుమార్‌ మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌గా ఉన్న మిశ్రా ప్రిన్సిపల్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ హోదాలో మూడు నెలలపాటు లేదా మరొకరు నియమితులయ్యే వరకు ఈడీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈడీ ప్రస్తుత డైరెక్టర్‌ కర్నాల్‌ సింగ్‌ పదవీ కాలం నేటితో ముగియనున్నందున ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్న కేబినెట్‌ నియామకాల కమిటీ శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. 1984 ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌(ఐఆర్‌ఎస్‌) ఆదాయ పన్ను(ఐటీ) కేడర్‌ అధికారి అయిన మిశ్రాకు పలు కీలక కేసుల బాధ్యతలు చూశారు. పీఎన్‌బీని వేల కోట్ల మేరకు మోసం చేసిన నీరవ్‌ మోదీ, లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కొడుకు కార్తీల మనీ లాండరింగ్‌ కేసుల విచారణలో మిశ్రా కీలకంగా ఉన్నారు. నల్లధనం చెలామణీని అరికట్టే మనీలాండరింగ్‌ చట్టం(పీఎంఎల్‌ఏ), విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం(ఫెమా)ల అమలును పర్యవేక్షించడం ఈడీ ముఖ్య బాధ్యత.

మూడేళ్లలో 33వేల కోట్ల ఆస్తుల అటాచ్‌
గడిచిన మూడేళ్లలో కేసుల విచారణ, ఆస్తుల అటాచ్‌మెంట్‌ వంటి విషయాల్లో ఈడీ గణనీయ పురోగతి కనబరిచింది. 2015లో ఈడీ డైరెక్టర్‌గా కర్నాల్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ రూ.33,500 కోట్లు కాగా మనీలాండరింగ్‌ కేసుల్లో 390 చార్జిషీట్లను దాఖలు చేసింది. కర్నాల్‌æ పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈడీ ఈ వివరాలు వెల్లడించింది. ఈడీ పనితీరు మెరుగు పరిచేందుకు కర్నాల్‌ సంస్కరణలు తెచ్చారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి  ప్రోత్సాహకాలను అందజేసే విధానం తెచ్చారు. మనీలాండరింగ్, విదేశీ మారక ద్రవ్య చట్టం ఉల్లంఘనలు, అవినీతికి సంబంధించిన పలు కీలక కేసుల విచారణను కర్నాల్‌ పర్యవేక్షించారు. వీటిల్లో వీవీఐపీ హెలికాప్టర్ల కేసు,చిదంబరం, కార్తీపై మనీ లాండరింగ్‌ కేసులు, స్టెర్లింగ్‌ బయోటెక్, బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి మాల్యా, నీరవ్,  చోక్సీ, 2జీ స్పెక్ట్రమ్‌ కేసు ముఖ్యమైనవి. 2015కు ముందు పదేళ్లలో 2,620 ఫెమా కేసుల విచారణను ఈడీ పూర్తి చేయగా ఒక్క కర్నాల్‌సింగ్‌ హయాంలోనే 5,495 కేసుల దర్యాప్తును పూర్తి చేసింది.

>
మరిన్ని వార్తలు