నిద్ర పట్టడం లేదు

1 Aug, 2014 22:38 IST|Sakshi
నిద్ర పట్టడం లేదు

నిద్ర పట్టడం లేదంటే.. ఏం మాయరోగం అంటారు పెద్దలు.. నిజమే ఏదో మాయకమ్మినట్లే నగరయువత రానురాను నిద్రకు దూరమౌతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఇంటర్నెట్, సెల్‌ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఎడతెగ ని ఆలోచనలు, వెరసి సిటీజన్ల కంటికి కునుకు పట్టనివ్వడం లేదు. రాత్రి 9 గంటలకే పడకపై హాయిగా సేదతీరాల్సిన వారు తెల్లవారుజామవుతున్నా కూడా మేలుకునే ఉంటున్నారు. ఢిల్లీలో 20 శాతం మంది నిద్రలేమితో బాధపడుతుంటే, వీరిలో అత్యధికులు మార్కెటింగ్, ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారే ఉండడం గమనార్హం.
 
న్యూఢిల్లీ:  రోజూ తెల్లవారగానే దాదాపు ఒకే సమయానికి మెలకువ వచ్చేస్తుంది. ఆహారం తీసుకునే సమయం కాగానే ఎవరో చెప్పినట్లు ఆకలేస్తుంది. రాత్రి కాగానే ఒక నిర్ధిష్ట సమయానికే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఏ సమయంలో ఏ పని చేయాలో నిర్దేశించే వ్యవస్థనే ‘బాడీ క్లాక్’ అంటాం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల ఈ ‘గడియారం’ గాడి తప్పుతోంది. ఒకప్పుడు రాత్రి 8 గంటలకే నిద్రకుపక్రమించిన సిటీజన్లు నేడు పని ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల తెల్లవారుజామవుతున్నా రెప్ప వాల్చడం లేదు.
 
మత్తుకు బానిసలవుతున్నారు...
గత రెండేళ్లతో పోలిస్తే నగరంలో నిద్రలేమి బాధితులు సంఖ్య రెట్టింపు అయిందని చెబుతున్నాయి వైద్యవర్గాలు. ఐటీ అనుబంధ రంగాలు విస్తరించడం విదేశీ కాలానికి అనుగుణంగా పనివేళలను మార్చుకోవడం, ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేసేందుకు శక్తికి మించి పని చేయడమే ఇందుకు కారణాలుగా వారు విశ్లేషిస్తున్నారు. బలవ ంతంగా నిద్ర పోయేందుకు బాధితుల్లో చాలా మంది నిద్రమాత్రలు, మద్యం వంటి ఇతర పదార్థాలకు అలవాటుపడుతున్నారు. ఇలా ఒక సమస్య నుంచి బయటపడేందుకు యత్నించి మరో సమస్యలో చిక్కుకుంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
35ఏళ్ల లోపువారే ఎక్కువ...
ప్రతి 10 మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారే. రాత్రి నిద్ర పోకపోవడం వల్ల మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్‌పై తీవ్రప్రభావం చూపుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు.. అంతేకాదు అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం తదితర జబ్బుల బారినపడే ప్రమాదం ఉంది. నా వద్దకు వచ్చే రోగుల్లో 20 శాతం మంది నిద్రలేమి బాధితులే.              - గుర్గావ్ మేదాంత ఆస్పత్రి మానసిక వైద్యనిపుణుడి మాట
 
సమస్యలెన్నో...
కంటినిండా నిద్రలేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయానికీ చిరాకు పడుతుంటారు. విపరీతమైన ఆగ్రహం ప్రదర్శించడంతో పాటు మానసిక రుగ్మతల బారిన పడుతుంటారు. పనిచేసే చోట ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి చేస్తున్న ఉద్యోగాన్ని సైతం కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఒంటిరిగా ఉన్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు తమలో తామే మాట్లాడుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.
  - డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్

మరిన్ని వార్తలు