82 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు

4 Dec, 2018 15:05 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వాడకందారుల సంఖ్య రానున్న ఐదేళ్లలో రెట్టింపై 82.9 కోట్లకు పెరగనుంది. ఇంటర్‌నెట్‌ వాడే వారి సంఖ్య ఏకంగా 60 శాతం పెరుగుతుందని సాంకేతిక దిగ్గజ కంపెనీ సిస్కోకు చెందిన విజువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌ (విఎన్‌ఐ) నివేదిక పేర్కొంది. 2017లో స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య 40.4 కోట్లు కాగా, జనాభాలో ఇంటర్‌నెట్‌ వాడే వారి సంఖ్య 27 శాతంగా ఉందని తెలిపింది. 2017లో ఇంటర్‌నెట్‌ నెట్‌వర్క్‌లు రోజుకు 108 పెటాబైట్స్‌ డేటా వాడుతుండగా, ఇది 2022 నాటికి రోజుకు 646 పెటాబైట్స్‌కు చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.

2022 నాటికి ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌లో వీడియో వీక్షణమే 77 శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది. ఇక 2017లో 51,500గా ఉన్న వైఫై హాట్‌స్పాట్స్‌ 2022 నాటికి 60 లక్షలకు చేరతాయని తెలిపింది. అప్పటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగం ఐదు రెట్లు పెరుగుతుందని తెలిపింది. సర్వీస్‌ ప్రొవైడర్లు తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు ఇది దోహదపడుతుందని సిస్కో సర్వీస్‌ ప్రొవైడర్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ కౌల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు