రూనా నవ్వింది!

27 Jul, 2014 00:22 IST|Sakshi
రూనా నవ్వింది!

మూడేళ్ల రూనా నవ్వింది... కానీ, ఆ నవ్వు కోసం కన్నపేగు ఎంతగా కన్నీరుకార్చిందో... డాక్టర్లు ఎన్ని శస్త్రచికిత్స చేశారో తెలిస్తే మీరు కూడా ఆ నవ్వు ఎంత విలువైందో అర్ధం చేసుకుంటారు. త్రిపురకు చెందిన అబ్దుల్లా రెహమన్, ఫాతిమాల గారాలపట్టి రూనా... తను అందరిలాంటి అమ్మాయి కాదు... పుట్టుకతోనే మృత్యవుతో పోరాటం చేసింది... పే...ద్ద తలతో పుట్టి అరుదైన వ్యాధితో మంచమెక్కింది. తమ బిడ్డ ప్రాణాల కోసం ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు. చివరకు గతేడాది రూనాను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ వద్ద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి రూనా హైడ్రోసెఫలాస్‌తో (మొదడులో నీరు చేరడం) బాధపడుతున్నట్లు తేల్చారు. మామూలుగా కంటే మూడు రెట్లు పెద్దదైన తలతో రూనా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే రూనా బతకగలదన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి 105 రోజులు ఆసుపత్రిలోనే గడిపిన రూనాకు డాక్టర్లు వందలకొద్ది శస్త్రచికిత్సలు చేశారు. అయినా ఏం లాభం లేదంటూ అదే ఏడాది ఆగస్టులో ఆమెను డి శ్చార్జ్ చేసి ఇంటికి పంపారు.

తర్వాత డిసెంబర్‌లో మరోసారి ఆమెకు సర్జరీ చేసి 37 ఇంచులున్న రూనా తలను 23 ఇంచులకు తగ్గించారు. బతికే ఛాన్సు మాత్రం తక్కేవనంటూ తల్లిదండ్రులను హెచ్చరిం చారు. కానీ, దేవుడు దయ తలిచా డు. రూనా తల్లిదండ్రుల వే దనను అర్ధం చేసుకున్నాడు. ఇప్పుడు రూ నా బతుకుతోంది. కాదుకాదు.. జీవిస్తుంది. అమ్మ ఒడిలో హాయి గా నవ్వుతూ.. గోరుముద్దలు కూడా తింటోంది. డాక్టర్లు చేతులెత్తేసినా తన బిడ్డ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడం ఫాతిమాకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. చుట్టుపక్కల వాళ్లు రూనా అంటే నవ్వుతూ తన బిడ్డ బదులిస్తుందంటూ ఫాతిమా ఆనందంగా చెబుతోంది. ఏదో ఒకరోజు తను కూతురు కూడా అందరిలా స్కూల్‌కు కూడా వెళుతుందని రూనా తండ్రి అబ్దులా నమ్మకంగా చెబతున్నాడు. ఇక డాక్టర్లు వైద్యచరిత్రలో రూనా ఒక అద్భుతం అంటూ తెగపొగిడేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు