-

'ఆ ఘటన మరిచిపోలేనిది, క్షమించరానిది'

26 Nov, 2019 14:39 IST|Sakshi

ముంబై : ముంబైలో 11 ఏళ్ల క్రితం నవంబర్‌ 26న జరిగిన 26/11 దాడులను అంత తేలికగా మరిచిపోలేమని, ఎన్నటికి క్షమించరానిదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ దాడులు జరిగిన తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ను ప్రతీకగా పెట్టి అమరవీరులకు కొవ్వొత్తితో నివాళి ప్రకటించిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఫోటోలో 'ఈ ఘటన మరిచిపోలేనిదని, ఎప్పటికి క్షమించరానిదని' అనే క్యాప్షన్‌ పెట్టారు. స్మృతి పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

'అవును మేం ఆ ఘటనను అంత తేలికగా మరిచిపోలేము. మమ్మల్ని కాపాడడానికి వారి ప్రాణాలను అర్పించిన అమరవీరులకు మా జోహార్లు. మీరు దేశం కోసం చేసిన ప్రాణత్యాగాలను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటామని' ఒక నెటిజన్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడు జరిగిన దాడులు భారతదేశంలో భయానక వాతావరణాన్ని సృస్టించాయని, దాడిలో మరణించిన అమరవీరులకు మా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నట్లు పలువురు కామెంట్లు పెట్టారు.

2008 నవంబర్‌ 26 ముంబైలో జరిగిన 26/11 దాడిలో 166 మంది చనిపోగా, 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా దేశంలోకి చొరబడి నాలుగు రోజులపాటు ముంబయిలోని చత్రపతి శివాజి అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌, ఒబెరాయి, తాజ్‌ ప్యాలెస్‌, నారిమన్‌ పాయింట్‌ వద్ద మారణహోమం సృష్టించారు. కాగా, కమాండోలు దాడులు జరిగిన ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకొని 9 మంది ఉగ్రవాదులు హతమార్చారు. ఈ క్రమంలో ప్రాణాలతో పట్టుకున్న కసబ్‌ను 2012 నవంబర్‌లో ఉరి తీశారు.

మరిన్ని వార్తలు