అప్పుడే అందరం బాగుంటాం: స్మృతి

30 Aug, 2019 12:01 IST|Sakshi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని, భావోద్వేగాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. అదే విధంగా ఫన్నీ కామెంట్లతో పాటు పలు స్పూర్తిదాయక కొటేషన్స్‌ను పోస్ట్‌ చేసే స్మృతికి ఇన్‌స్టా ఫాలోవర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ క్రమంలో ఫ్రీ యువర్‌ మైండ్‌ ఫ్రైడే పేరిట స్మృతి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు..
‘మనల్ని నిరుత్సాహ పరిచే వాళ్ల నుంచి .. ఎన్నటికీ పరిష్కారం కనుగొనలేని సమస్యల నుంచి...ఎంతగా ప్రయత్నించినా మన అనుకున్న వాళ్లు మన విలువ తెలుసుకోలేని పరిస్థితుల నుంచి దూరంగా వెళ్లిపోవాలి. మన ఆత్మను నిరాశా నిస్పృహలతో నింపే ఇటువంటి వ్యక్తులు, పరిస్థితుల నుంచి ఎంత దూరంగా వెళ్తే అంత ఆరోగ్యంగా ఉంటాం’ అంటూ స్మృతి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో స్పూర్తిదాయక వ్యాక్యాలతో కూడిన ఫ్రైడే బెస్ట్‌ టిప్‌ ఇది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో రెండుసార్లు చోటు దక్కించుకున్న స్మృతి...ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి హోదాలో బరిలో దిగిన రాహుల్‌ గాంధీని మట్టికరిపించిన ఆమె.. మోదీ 2.0 కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా చరిత్ర సృష్టించారు.

మరిన్ని వార్తలు