ఇంట్లో మాస్క్ త‌యారు చేసిన స్మృతి ఇరానీ

10 Apr, 2020 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ : కోవిడ్‌-19 (క‌రోనా వైర‌స్‌) వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అత్య‌వ‌స‌ర ప‌ని మినహా మిగ‌తా వాటికి జ‌నాలు బ‌య‌ట తిర‌గ‌డానికి వీల్లేద‌ని అధికారులు తేల్చి చెప్తున్నారు. అయితే ఆ అత్య‌వ‌స‌ర ప‌ని నిమ‌త్తం గ‌డ‌ప దాటిన మ‌రుక్ష‌ణం నుంచి మాస్క్ త‌ప్ప‌నిస‌రి. దీంతో మార్కెట్‌లో వాటి డిమాండ్ ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో.. దొరికిందే చాన్స‌ని కొంద‌రు రెట్టింపు ధ‌ర‌ల‌కు అమ్మ‌డం ప్రారంభించారు. దీనిపై మండిప‌డ్డ ప్ర‌భుత్వం మాస్కులు అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించ‌డంతో వాటి రేట్లు కొంత‌ త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే మాస్కుల కోసం దుకాణాల వెంట తిర‌గాల్సిన ప‌ని లేద‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్తున్నారు. (లోక్‌సభలో ‘ఉన్నావ్‌’ రభస)



ఇంట్లోనే ఉండి ఎంతో సులువుగా మాస్కు త‌యారు చేసుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మాస్క్ ఎలా తయారు చేయాలో చెప్తూ దానికి సంబంధించిన ఫొటోల‌ను పంచుకున్నారు. ముందుగా క‌త్తెర‌తో వస్త్రాన్ని నిర్దిష్ట ఆకృతిలో క‌త్తిరించారు. అనంత‌రం కుట్టు మిష‌న్ లేక‌పోతే దానికి బ‌దులుగా సూది, దారాన్ని వాడ‌మ‌ని చెప్తూ చేతిపైనే ఎలా కుట్టాలో చూపించారు. ఈ విధంగా సుల‌భంగా మాస్క్ త‌యారు చేసుకోండంటూ.. చివ‌ర‌గా తాను చేసిన ఫేస్ మాస్క్‌ను చూపించారు. కాగా మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే కొన్నిచోట్ల జ‌రిమానాలు సైతం విధిస్తున్న విష‌యం తెలిసిందే. (కుప్పలు కుప్పలుగా కరోనా మృతదేహాల ఖననం)

>
మరిన్ని వార్తలు