సైనికులతో స్మృతి ఇరానీ రక్షాబంధన్..!

11 Aug, 2016 09:33 IST|Sakshi

న్యూఢిల్లీః కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యుద్ధ భూమికి పయనమౌతున్నారు. వచ్చేవారం సియాచిన్ గ్లేసియర్ వద్ద సైనికులతో రక్షాబంధన్ జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు. స్మృతీ పర్యటనకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ అనుమతికూడా మంజూరు చేశారు.

హిమాలయాల్లోని తూర్పు కారాకోరం పర్వతశ్రేణుల్లో ఉన్న సియాచిన్... ఎత్తైన మంచు శిఖరం. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రంగా పేరొందిన సియాచిన్ గ్లేసియర్ ప్రాంతానికి వెళ్ళేందుకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సన్నాహాలు చేస్తున్నారు. ఈశాన్య రాజస్థాన్, కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలోని సియాచిన్ లో జవాన్లతో కలసి మంత్రి ఇరానీ రాఖీ పండుగను జరుపుకోనున్నారు. స్మృతి ఇరానీ పర్యటనకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ అనుమతికూడా లభించింది. ఈ నెల 18న రక్షా బంధన్ ను పురస్కరించుకొని ఇరానీతోపాటు మహిళా మంత్రుల బృందం సియాచిన్ బేస్ క్యాంప్ కు వెళ్ళనున్నారు. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఉమాభారతి, మేనకాగాంధీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, అనుప్రియ పటేల్ లు స్మతి ఇరానీతోపాటు బేస్ క్యాంపుకు వెళ్ళి అక్కడి సైనికులకు రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోనున్నట్లు రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు