‘అవని’ని చంపడంపై అన్ని అనుమానాలే

6 Nov, 2018 17:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో 13 మంది మనుషుల ప్రాణాలను తీసిన ‘అవని’ అనే ఆడపులిని చంపేయడం పట్ల ఇప్పుడు అన్నీ అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా జీవ కారుణ్య కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పులిని చంపేశారని ఆరోపిస్తున్నారు. ఏడాది పిల్లలున్న ఆరేళ్ల ‘అవని’ లేదా టీ వన్‌గా పిలిచే పులి.. మానవ మాంసానికి అలవాటు పడిందన్న కారణంగా దాన్ని చంపేందుకు సుప్రీంకోర్టు కూడా అనుమతి మంజూరు చేసింది. అయితే ముందుగా ‘ట్రాంక్విలైజ్‌’ మత్తు కలిగిన చిరు బాణాన్ని ప్రయోగించడం ద్వారా పులిని ప్రాణాలతో నిర్బంధించేందుకు ప్రయత్నించాలని విధిలేని సమయంలోనే చంపాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సూచించింది. వాటిని పాటించలేదన్నది జీవ కారుణ్య కార్యకర్తల ఆరోపణ.

పులిని చంపేందుకు షవత్‌ అనీ ఖాన్‌ అనే వేటగాడికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా ఆయన తన వెంట తన కుమారుడు అస్ఘర్‌ అలీ ఖాన్‌ను వేటకు తీసుకెళ్లారు. పగటిపూట పులిని వేటాడాల్సి ఉండగా రాత్రిపూట వేటాడారు. వేటాడే బృందంలో ప్రభుత్వానికి చెందిన వైద్య నిపుణుడు ఉండాలి. లేరు. పైగా రాచరిక వ్యవస్థలోలాగా పులి మృతదేహంతో వేటగాడు, అధికారులు ఫోజుగా ఫొటో దిగారు. ఈ అంశాలన్నింటినీ ఏకరువు పెట్టిన జీవకారుణ్య కార్యకర్తలు.. అధికారులకు అసలు పులిని సజీవంగా పట్టుకోవాలనే ఉద్దేశం లేదని విమర్శిస్తున్నారు. ప్రాణాలు పోకుండా పులిని కాపాడి ఉండాల్సిందా ? అని ప్రశ్నించగా, పులి పంజాకు ప్రాణాలు కోల్పోయిన 13 మంది ప్రాణాలను ఎలాగైతే రక్షించి ఉండాల్సిందో, అలాగే పులిని రక్షించి ఉండాల్సిందని వారంటున్నారు.

మరిన్ని వార్తలు