కరోనాను కట్టడి చేసే సబ్బు సంగతులు

20 May, 2020 12:11 IST|Sakshi

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అమలాపురం నుంచి అమెరికా దాకా అందరు చెబుతూనే ఉన్నారు. అసలు కరోనాకు సబ్బుకున్న సంబంధం ఏమిటి? మానవ నాగరిక చరిత్రలో సబ్బుకున్న ప్రాధాన్యత ఏమిటి? అసలు దాని పరిణామక్రమం ఎట్టిది?

సబ్బుతో చేతులను కడుక్కుంటే చేతుల చర్మ కణాల్లో దాక్కున్న కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు వెలికి వస్తాయి. వాటిని ఆవలికి తోసి పడేస్తుంది. మానవ నాగరికత అంతగా పరిఢవిల్లకముందు అన్నింటిని నీటితోని శుభ్రం చేసేవారు. చమురు అంటిన వస్తువులు, పాత్రలు నీటితో శుభ్రం అయ్యేవి కావు. నీరు, చమురు అణువులు వేటికవే కలసుకుంటాయిగానీ, ఒకదానికొకటి కలవవు. అందుకని చమురును నీటితో శుభ్రం చేయలేం. కొవ్వు కణాలు, కర్రలను కాల్చడం వల్ల వచ్చే బూడిదతోనే చమురును శుభ్రం చేయగలం. సబ్బు పుట్టుక మూలాలు ‘మెసపటోనియా’ నాగరికతలోనే కనిపిస్తాయి. అప్పటి మానవులు ఆవు, మేక లేదా గొర్రెల నుంచి తీసిన కొవ్వుకు, బూడిదను కలిపి సబ్బులాగా ఉపయోగించేవారు.

బూడిదలో ‘పొటాషియం హైడ్రాక్సైడ్‌’ లాంటి పదార్థం ఉంటుంది కనుక చమురుకు వ్యతిరేకంగా పని చేస్తుంది. క్రీస్తు శకం 77వ సంవత్సరంలో రోమన్‌ స్కాలర్‌ ప్లినీ ది ఎల్డర్‌ రాసిన ‘నేచురలీస్‌ ఇస్టోరియా’ పుస్తకంలో మొదటిసారి సబ్బు గురించి వివరణ ఉంది. ఆవు కొవ్వు, కట్టెల బూడిదతో కలిపి అప్పటి మగవాళ్లు జుట్టుకు పూసుకునే వారట. కొంచెం  వెంట్రుకలు ఎరపు రంగులో ఉండేందుకు వారలా ఉపయోగించేవారట. అప్పట్లో ఈ సబ్బుకు ఓ నిర్దిష్ట ఆకారం లేదట.  వారు అప్పుడు వూల్‌ను ఉతికేందుకు కూడా ఈ సబ్బును ఉపయోగించేవారట. గ్రీకులు, రోమన్లు కూడా సామూహిక లేదా బహిరంగ స్నానాల్లో ఒంటికి ఈ సబ్బు పదార్థాన్ని రాసుకునే వారట. ఆ తర్వాత వారిలో ఆలీవ్‌ ఆయిల్‌ వాడకం వచ్చిందట. ( అప్ప‌టినుంచే వాడ‌కం..ఆ స‌బ్బుపై నిషేధం )

మధ్యయుగాల్లో వెజిటబుల్‌ ఆయిల్‌తో చేసిన బార్‌ సోపులు అందుబాటులోకి వచ్చాయట. మొట్టమొదట సిరియాలో ఆలీవ్‌ ఆయిల్‌ నుంచే తీసిన మరింత సువాసన కలిగిన లారెల్‌ ఆయిల్‌తో తయారు చేసిన ఆకుపచ్చ బార్‌ సబ్బు మార్కెట్‌లోకి వచ్చిందట. బహూశా సబ్బు ఆకారంలో మొదట వచ్చింది అదే కావచ్చు. ‘అలెప్పో సోప్‌’గా వ్యవహరించే ఆ సబ్బు సంపన్న కుటుంబాలకే పరిమితం అయ్యిందట. ఆ సబ్బును క్రైస్తవ ఆక్రమితులు, వ్యాపారస్థులు యూరప్‌కు పరిచయం చేశారట.  ఆ తర్వాత ‘జబాన్‌ డీ క్యాస్టిల్లా’ (క్యాజిల్‌ సోప్‌) ఫ్రెంచి, ఇటాలియన్, స్పానిష్‌లో ప్రాచుర్యం పొంది క్యాజిల్‌ సోప్‌గా ఇంగ్లీషువారికి పరిచయమైందట. అప్పుడు ఇంగ్లీషు వారు ఎక్కువ దాన్ని టాయ్‌లెట్‌ సోప్‌గానే పరిగణించే వారట.

775లో బూడిద, గ్రీస్‌ను ఆవు లేదా మేక కొవ్వుతో కలిపి ఉడికించి మహిళలు సబ్బును తయారు చేసినట్లుగా కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమంలో న్యూయార్క్‌లో 1807లో స్థాపించిన ‘కాల్గేట్‌’ కంపెనీ, సినిసినట్టిలో 1837లో ఏర్పాటయిన ‘ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌’ కంపెనీలు సబ్బు మూలకాలైన కొవ్వు, బూడిద ప్రమాణాలను తీసుకొని పెద్ద ఎత్తున సబ్బులను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. నాడు కొవ్వొత్తుల తయారీకి కూడా జంతువుల కొవ్వునే వాడేవారు. కొవ్వొత్తులతోపాటు సబ్బులను ఉత్పత్తి చేసే ‘ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌’ కంపెనీ, కావాల్సిన కొవ్వు కోసం ఇళ్లకు, హోటళ్లకు, కటిక వాళ్ల వద్దకు కూలీలను పంపించి సేకరించే వారట. ఆ తర్వాత సబ్బు కంపెనీలు సుగంధ ద్రవ్యాలను, తైలాలను కలిపి రక రకాల సబ్బులను తయారు చేయడం ప్రారంభించాయి. ( 50 మంది వలస కూలీలకు కరోనా )

అలా 1879లో ‘ప్ట్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌’ కంపెనీ  మొట్టమొదటి సారిగా సువాసన వెదజల్లే మొట్టమొదటి టాయ్‌లెట్‌ సోప్‌ను ‘ఐవరీ సోప్‌’ పేరిట విడుదల చేసింది. ఆ తర్వాత అదే క్రమంలో అమెరికా మిల్వావుకీలోని ‘బీజే జాన్సన్‌ సోప్‌ కంపెనీ’ 1898లో సువాసనతో కూడా పామోలివ్‌ సోప్‌ను విడుదల చేసింది. 1900 దశకంలో పామోలివ్‌ సబ్బు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.సబ్బుల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించడం పట్ల శాకాహారుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రత్యామ్నాయ ప్రయోగాలపై దృష్టిని కేంద్రీకరించారు. 1909లో వెజిటబుల్‌ ఆయిల్స్‌ నుంచే కొవ్వులను తయారు చేయడం కనుగొనడంతో సబ్బుల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ప్రధానంగా జంతువుల కొవ్వుకు బదులుగా ల్యాబుల్లో సృష్టించిన విజిటబుల్‌ ఆయిల్‌ కొవ్వుకు పామోలిన్‌ ఆయిల్‌తోపాటు కొబ్బరి నూనె, పత్తి నూనె ఇతర మొక్కల నూనెలతోపాటు సెంట్లు, రంగులు, పలు రకాల రసాయనాల మిశ్రమాన్ని కలిపి సబ్బులను తయారు చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం ‘షోవర్‌ జెల్స్‌’ లాంటి పెట్రో ఉత్పత్తులను కూడా సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. మానవాళిపై కరోనా లాంటి మహమ్మారీలు దాడి చేసినప్పుడల్లా సబ్బుల ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు