ఆమె దీక్ష భగ్నం

8 Aug, 2017 10:36 IST|Sakshi
ఆమె దీక్ష భగ్నం

ధార్‌: సామాజిక ఉద్యమ కారిణి మేధా పాట్కర్‌(62) నిరాహార దీక్షను మధ్యప్రదేశ్‌ పోలీసులు భగ్నం చేశారు. సర్దార్‌ సరోవర్‌ డ్యాం ముంపు బాధితులకు సరైన పునరావాసం కల్పించాలని కోరుతూ గత 12 రోజులుగా దీక్ష చేస్తున్న ఆమెను సోమవారం రాత్రి బలవంతంగా ఇండోర్‌ ఆస్పత్రికి తరలించారు. మేధా పాట్కర్‌తో పాటు 11 మంది ఉద్యమకారుల దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. వీరంతా జూలై 27 నుంచి మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా ఛిఖల్డా గ్రామంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

దీక్షను భగ్నం చేయడానికి ముందు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్‌ఘాట్‌ వంతెనపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఛిఖల్డాకు వెళ్లే దారులను ముసివేశారు. డ్రోన్‌ కెమెరాలతో ఆందోళనకారుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించారు. ముందుగానే ఛిఖల్డా గ్రామానికి 12 అంబులెన్స్‌లు పంపించారు. రాత్రి బాగా పొద్దుపోయాక వేదిక వద్దకు చేరుకుని మేధా పాట్కర్‌తో సహా 11 మంది ఉద్యమకారుల దీక్షను భగ్నం చేశారు. పోలీసులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పిల్లలు, మహిళలతో సహా 12 మంది గాయపడ్డారని నర్మదా బచావో ఆందోళన్‌ కార్యకర్తలు ఆరోపించారు.

12 రోజులుగా దీక్ష చేస్తున్న తమతో సమగ్ర చర్చలు జరపకుండా మోదీ, శివరాజ్‌ సింగ్‌ సర్కారు అక్రమంగా అరెస్ట్‌ చేసిందని మేధా పాట్కర్‌ ఆరోపించారు. పోలీసుల చర్యతో గాంధీజీ కన్న కలలను హత్య చేశారని పేర్కొన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.
 

మరిన్ని వార్తలు