కశ్మీరం పై సోషల్‌ ‘యుద్ధం’

6 Aug, 2019 01:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గత నాలుగైదు రోజులు గా కశ్మీర్‌ పరిణామాలను గమనిస్తున్న ప్రజానీకం సోమవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయింది. 370వ అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంతో తెలుగు ప్రజలు సోమవారమంతా ఇదే విషయంపై చర్చలు జరిపారు. ఏ ఇద్దరు మనుషులు కలిసినా, రాజకీయ నేతలు ఎదురుపడినా కశ్మీర్‌ అంశంపైనే మాట్లాడుకోవడం గమనార్హం. 

ఏమవుతుందో ఏమో? 
దేశ భద్రత, భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పెరుగుతుందా.. తగ్గుతుందా అనే విషయంపై ఎక్కువగా చర్చ జరగడం తెలుగు ప్రజల చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. దీంతో పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కశ్మీర్‌ ప్రజ ల్లో ఎలాంటి స్పందన వస్తుంది.. దేశ భద్రతకు సంబంధించి ఏమైనా పరిణామాలు జరుగుతాయా.. సరిహద్దుల్లో సైన్యం మోహరింపు ఎలా ఉంది.. స్థానికంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు.. కేంద్ర నిర్ణయం స్టాక్‌మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపింది.. అనే అంశాలు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

సామాజిక మాధ్యమాల్లోనూ.. 
సామాజిక మాధ్యమాల వేదికగా కశ్మీర్‌ అంశంపై భిన్న వాదనలు నడిచాయి. 370వ అధికరణ ద్వారా అక్కడి ప్రజలకు సంక్రమించిన అధికారాల విషయంలో ఇరువర్గాలు ఓ రకంగా సామాజిక మాధ్యమాల్లో యుద్ధమే చేశాయి. ఈ అధికరణ ద్వారా కశ్మీర్‌లో వివాహానంతర వారసత్వ హక్కులు, దేశంలోని ఇతర రాష్ట్రాలకున్న ప్రత్యేక అధికారాలు, కశ్మీర్‌లో కేంద్ర చట్టాలు, అత్యున్నత న్యాయస్థానాల తీర్పుల అమలు తదితర అంశాలపై పోస్టులు వైరల్‌ అయ్యాయి. ఈ అధికరణ నెహ్రూ, అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందమని కొందరు, దేశాన్ని విభజించి పాలించేందుకు జరుగుతున్న కుట్రను ఎదుర్కోవాలంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు చేస్తూ పోస్టులు పెట్టారు.  

మరిన్ని వార్తలు