ఆమె ఎందుకు సోషల్ మీడియాలో రాజీనామా చేశారు?

2 Aug, 2016 14:27 IST|Sakshi
ఆమె ఎందుకు సోషల్ మీడియాలో రాజీనామా చేశారు?

గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘డిజిటల్ ఇండియా’ ప్రాజెక్టు ఆయన ఊహించిన దానికన్నా బాగా పనిచేస్తున్నట్లు ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ సోమవారం తన రాజీనామాను సోషల్ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్  ద్వారా ప్రకటించారు. దేశంలో ఇలా రాజీనామా ఆఫర్ చేసిన  తొలి ముఖ్యమంత్రి బహూశ ఆమె అయివుంటారు. సాధారణంగా ఏ పార్టీ ముఖ్యమంత్రి అయిన తమ రాజీనామా లేఖను ముందుగా పార్టీ అధిష్టానంకు స్వయంగా అందజేస్తారు లేదా ఫ్యాక్స్ చేస్తారు. అలా చేయకుండా పటేల్ మాత్రం ఎందుకు సోషల్ మీడియా మాధ్యమాన్ని ఎన్నుకున్నారు? దానిలో ఉన్న ఆంతర్యం ఏమిటీ?

తనకు 75 ఏళ్ల వయస్సు సమీపిస్తున్నందున పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించుకున్నారు. పార్టీలో ఈ నియమం పెట్టిందీ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే. ఆమెకు రాజీనామా చేయక తప్పదనే విషయాన్ని ఏడాది ముందే సూత్రప్రాయంగా మోదీనే సంకేతం ఇచ్చారు. 75 ఏళ్లలో అడుగుపెట్టిన తన మంత్రి వర్గ సభ్యులను తొలగించాల్సిందిగా మోదీయే స్వయంగా ఆమెను ఆదేశించారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోక పోవడానికి వారి వయస్సే కారణమని కూడా సమర్థించుకున్నారు. మోదీ ఆదేశాల మేరకు ఆమె 75వ వడిలో అడుగు పెట్టిన ఇద్దరు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించారు. ఈ నవంబర్ నెలలో 75వ ఏటలో అడుగుపెడుతున్న తనకు కూడా రాజీనామా చేయక తప్పదని ఆనాడే భావించారు. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న యూపీకి అధిక ప్రాధాన్యం కల్పించేందుకు తాను పెట్టిన నియమాన్నే మోదీ అతిక్రమించి వృద్ధులను కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా తీసుకున్నారు.  

గుజరాత్‌లో ఉవ్వెత్తున లేచిన పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన, ప్రస్తుతం కొనసాగుతున్న దళితుల ఆందోళన ఆనందిబెన్ పటేల్ పాలనకు చెడు పేరును తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఈ కారణంగానే ఆమెను పదవి నుంచి తప్పించడం లేదు. అలా తప్పించదల్చుకుంటే ఆనందిబెన్ పటేల్ పదవిని దుర్వినియోగం చేసి ఆమె పిల్లలు అవినీతికి పాల్పడుతున్నారంటూ రాష్ట్రంలో గగ్గోలు ఎత్తినప్పుడే ఆమెను తొలగించి ఉండాల్సింది. ఆమెను పదవి నుంచి తప్పించడం వెనక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని గెలిపించే నాయకత్వం కావాలన్నదే బిజేపీ అధిష్టానం అభిమతం. ఆ అభిమతం ప్రకారమే ఇప్పుడామే స్పందించారు. రాజీనామా కోసం సోషల్ మీడియాను ఆశ్రయించడమే పార్టీలోని అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నాయకత్వం పట్ల ఒకరకమైన అసంతృప్తిని వ్యక్తం చేయడమే ఆమె అభిమతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆమె రాజీనామాపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ లాంటి రాజకీయ నాయకులు ఒకరిద్దరు మినహా సోషల్ మీడియా యూజర్లు ఎక్కువ మంది తమదైన శైలిలోనే స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆప్ పార్టీ విజయం ఇదని కేజ్రివాల్ స్పందించారు.


ఫేస్‌బుక్‌లో కూడా రిజైన్ బటన్‌ను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు, ‘నేను దీన్ని ఆమోదిస్తున్నాను’ అంటూ రాష్ట్ర గవర్నర్ కామెంట్ చేస్తే సరిపోతుందని మరికొందరు. లైకింగ్ హర్ పోస్ట్ ద్వారా బీజేపీ నాయకత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఇంకా బాగుంటుందని ఇంకొందరు వ్యాఖ్యానాలు చేశారు. ‘ఆలసించినా ఆశాభంగం. తక్షణం ఆమోదించండి లేకపోతే రాజీనామా లేఖను ఫేస్‌బుక్ నుంచి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది’ అంటూ ఒకరిద్దరు హెచ్చరించారు. లేఖను మోదీకి పంపించకుండా సోషల్ మీడియాను ఆశ్రయించడంలో ఆంతర్యం ఏమిటని, ఇది మోదీ విజయమని వ్యాఖ్యానించిన వారు కూడా లేకపోలేదు. రాజకీయ పదవుల్లో ఉన్నవారు  ఫేస్‌బుక్ ద్వారా రాజీనామా చేయాలని, ట్విట్టర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయాలని, వాట్సాప్ ద్వారా కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చలోక్తులు విసిరిన వారు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు