క్షుద్ర పూజలకు మట్టి తీశాడని..

28 Dec, 2017 21:59 IST|Sakshi

సాక్షి, ఒడిశా : క్షుద్ర పూజ జరిపేందుకు తన ఇంటి ముంగిట మట్టిని తీసుకువెళ్తున్న ఒడిశాకు చెందిన గిరిజన యువకుడ్ని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించిన ఘటన సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలో నివాసముంటున్న చుక్క వెంకటరమణ ఇంటి ముంగిట మట్టిని ఒడిశా రాష్ట్రం రాళ్లగడ్డ సమీపంలోని పుక్కిలి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు జయరాం తీసుకుని వెళుతుండగా అక్కడ వున్న మహిళలు అతడ్ని ప్రశ్నించారు.

దీంతో ఆ యువకుడు తనను ఈ ఇంటి ముంగిట వున్న మట్టిని తీసుకురమ్మని రామా కాలనీకి చెందిన పల్లి వెంకటరావు పురమాయించాడని చెప్పినట్టు స్థానికులు తెలిపారు. ఆ మట్టి ఎందుకని ప్రశ్నిస్తే పూజలు చేయడానికని ఆ యువకుడు బదులివ్వడంతో దేహశుద్ది చేసి, పట్టణ పోలీసులకు అప్పగించారు. ఇదిలా వుండగా చుక్క వెంకటరమణ కుటుంబానికి, పల్లి వెంటకరావు కుటుంబానికి వైరం నడుస్తుందని, అందుకే క్షుద్ర పూజలు జరిపించి, తమ కుటుంబాన్ని నాశనం చేసేందుకు వెంకటరావు కుట్ర పన్నాడని వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు