కాంగ్రెస్ పెద్దలు నన్ను వాడుకున్నారు: సరిత

11 May, 2016 18:17 IST|Sakshi
కాంగ్రెస్ పెద్దలు నన్ను వాడుకున్నారు: సరిత

కాంగ్రెస్ పెద్దలు తనను ఒక పావులా వాడుకున్నారని, కొచ్చిన్ పోర్టు ట్రస్టుకు చెందిన ఒక భూమి డీల్‌లో తాను మధ్యవర్తిగా కూడా వ్యవహరించానని కేరళ సోలార్ స్కాంలో కీలక నిందితురాలు సరితా నాయర్ చెప్పింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన కొడుకు, కొందరు కేబినెట్ మంత్రులపై తన ఆరోపణలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను ఆమె బుధవారం నాడు విచారణ కమిషన్‌కు సమర్పించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం ఉందనగా సరితా నాయర్ తన తాజా అస్త్రాన్ని బయటకు తీయడం గమనార్హం. తాను రెండు పెన్ డ్రైవ్‌లు, కొన్ని పత్రాలను కమిషన్‌కు ఇచ్చానని, తాను రాసిన లేఖలోని అంశాలకు, కొందరు కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటపెడుతూ ఏషియా నెట్ చానల్ ప్రసారం చేసిన కథనానికి అవి ఆధారాలని సరితా నాయర్ చెప్పింది. శుక్రవారం మరికొన్ని ఆధారాలు సమర్పిస్తానని ఇంకో బాంబు పేల్చింది.

కాగా, సరితా నాయర్‌పైన, ఏషియానెట్ చానల్‌పైన సీఎం ఊమెన్ చాందీతో పాటు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా పరువునష్టం దావా వేశారు. సరితా నాయర్ మీద, ఆమె సహజీవన భాగస్వామి బిజు రాధాకృష్ణన్ మీద సోలార్ స్కాంలో దాదాపు 30 వరకు కేసులు ఉన్నాయి. వాళ్లు పలువురు పెట్టుబడిదారులను దాదాపు రూ. 6 కోట్ల మేర ముంచేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరిత బెయిల్ పొంది బయటకు రాగా, రాధాకృష్ణన్ మాత్రం తన మొదటి భార్య హత్య కేసులో ఇంకా జైల్లోనే ఉన్నారు.

మరిన్ని వార్తలు