వీరజవానుకు ఘనంగా అంత్యక్రియలు

4 Mar, 2017 18:25 IST|Sakshi
బాపట్ల టౌన్‌(గుంటూరు): శ్రీనగర్‌లో విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన అక్కల చిన్నచెన్నారెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన చిన్న చెన్నారెడ్డి దేశ సరిహద్దులో ఈనెల 3వ తేదీన విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని అక్కడినుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్‌కు, అక్కడి నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య రోడ్డుమార్గాన శనివారం ఉదయం తన స్వగ్రామమైన పట్టణంలోని మున్నంవారిపాలెం తీసుకువచ్చారు. చెన్నారెడ్డికు భార్య తిరుపతమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
హైదరాబాద్‌ నుంచి వచ్చిన 10 మంది సుబేదార్లు, 8 మంది సిపాయిలు, పోలీసుల సహాకారంతో మున్నంవారిపాలెంలో స్వగృహం నుంచి హిందూస్మశానవాటిక వరకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించి, స్మశానవాటికలో గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. చెన్నారెడ్డి ఇరవయ్యేళ్లుగా దేశ రక్షణ విధుల్లో చేరినప్పటి నుంచి కూడా ఎంతో ధైర్యంగా ముందుకుపోతూ తోటి సైనికులకు అండగా ఉండేవారని ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ బాలాజీ తెలిపారు. ఆయన భార్య తిరుపతమ్మకు జీవితాంతం పెన్షన్‌ సౌకర్యం అందిస్తామని, ప్రస్తుతం చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం, మరొకరి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదేవిధంగా, కేంద్రప్రభుత్వం నుంచి రూ. 25 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో అందుతుందని తెలిపారు. 
 
 
>
మరిన్ని వార్తలు