16 గంటల నరకం తర్వాత ఆ కుటుంబానికి శుభవార్త!

18 Jun, 2020 18:37 IST|Sakshi
జవాను సునీల్‌ కుమార్‌(కర్టెసీ: హిందుస్థాన్‌)

భారత జవాను సునీల్‌ కుటుంబానికి ఊరట

పట్నా: ‘‘ఆయన గొంతు విన్నాక కన్నీళ్లు ఆగలేదు. ఆనందం పట్టలేకపోయాను. అవును.. అది రోషిణి వాళ్ల నాన్న గొంతే’’ అంటూ భారత ఆర్మీ జవాను సునీల్‌ కుమార్‌ భార్య మేనక ఉద్వేగానికి లోనయ్యారు. తన భర్త బతికే ఉన్నాడన్న వార్త తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు వీర మరణం పొందిన విషయం విదితమే.  తొలుత ఈ ఘటనలో కల్నల్‌ సహా ఇద్దరు జవాన్లు మరణించారని వెల్లడించిన ఆర్మీ.. ఆపై తీవ్రంగా గాయపడిన మరో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని బుధవారం వారి పేర్లను విడుదల చేసింది. (విషం చిమ్మిన చైనా..)

ఈ క్రమంలో బిహార్‌కు చెందిన సునీల్‌ కుమార్‌ అసువులు బాసినట్లుగా ఆర్మీ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సునీల్‌ కుమార్‌ త్యాగాన్ని కీర్తిస్తూ స్థానికులంతా ఆయన నివాసానికి చేరుకుని కుటుంబాన్ని ఓదార్చారు. వీర జవానుకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆర్మీ నుంచి వచ్చిన మరో ఫోన్‌ కాల్‌ వారి ముఖాల్లో ఆనందాన్ని నింపింది.(‘ఇద్దరు మనుమలనూ సైన్యంలోకి పంపుతా’)

సరిహద్దు ఘర్షణలో మరణించిన వేరే జవాను కుటుంబానికి బదులు పొరబాటున సునీల్‌ గ్రామానికి ఫోన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ సునీల్‌ కుమార్‌ భార్య మేనక మాత్రం షాక్‌ నుంచి తేరుకోకపోవడంతో.. ఆర్మీలోనే పనిచేస్తున్న ఆయన సోదరుడు అనిల్‌ ద్వారా మరోసారి సమాచారాన్ని చేరవేశారు. బుధవారం మధ్యాహ్నమే తనకు ఈ విషయం తెలిసిందని ఆమెను ఓదార్చాడు. అనంతరం కాన్పరెన్స్‌ కాల్‌లో మేనక సునీల్‌తో మాట్లాడే విధంగా ఆర్మీ అధికారులు గురువారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో వారి కుటుంబంలో అలుముకున్న విషాదం తొలగిపోయి.. ఆనందం వెల్లివిరిసిందని హిందీ డైలీ హిందుస్థాన్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు