చనిపోయిన జవాను ఏడేళ్ల తర్వాత తిరిగొస్తే..

16 Jun, 2016 15:47 IST|Sakshi
చనిపోయిన జవాను ఏడేళ్ల తర్వాత తిరిగొస్తే..

న్యూఢిల్లీ: దేవుడి ఆటముందు మన ఆట ఎంత? అనే మాట సహజంగా అప్పుడప్పుడు వింటుంటాం. ఆయన ఇచ్చే ట్విస్టులు కూడా మాములుగా ఉండవని చెబుతుంటాం. ఓ ఆర్మీ జవాను జీవింతంలో జరిగిన ఈ విషయం చూస్తే మాత్రం నిజంగానే దేవుడు గొప్ప స్క్రిప్ట్ రైటరేమో అనిపిస్తుంది కూడా. ఊహించని ట్విస్టులతో సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా ఈ విషయం వింటే సినిమా కథగా పెట్టుకొని హిట్ కొట్టడం ఖాయం. చనిపోయాడని అనుకున్న ఓ ఆర్మీ జవాను తిరిగి బతికొచ్చాడు. భారత ఆర్మీ సైతం అతడి చనిపోయాడని ప్రకటించగా ఏడేళ్ల తర్వాత అబ్బురపడేలా అతడు సురక్షితంగా వచ్చి తన ఇంటి తలుపుకొట్టాడు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. అతడి పేరు ధరమ్ వీర్ సింగ్. డెహ్రాడూన్లోని 66వ సాయుధ రెజిమెంట్ దళంలో డ్రైవింగ్ జవానుగా పనిచేసేవాడు. 2009లో తన తోటి జవాన్లతో కలిసి ట్రక్కులో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ వాహనం కొండల్లో నుంచి పడిపోయింది. అతడితో సహా ఏ ఒక్కరి జాడ తెలియలేదు. ఆఖరికి వారి మృతదేహాలు కూడా లభ్యం కాలేదు. అలా మూడేళ్లు వెతికిన తర్వాత వారంతా చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది. అయితే, ఆ ప్రమాదానికి గురైన ధరమ్ వీర్.. గాయాలపాలయ్యాడు. ఆ ప్రమాదం కారణంగా మతిభ్రమించింది. దీంతో డెహ్రాడూన్ కొండల్లోనే చుట్టుపక్కల పిచ్చివాడిలా తిరిగాడు. అయితే, ఈ మధ్యే అతడిని ఓ బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో అదృష్టవశాత్తు పోయిన జ్ఞాపకశక్తి తిరిగొచ్చింది.

ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అతడికి రూ.500 ఇవ్వడంతో వాటిని తీసుకొని తొలుత ఢిల్లీ వచ్చాడు. అనంతరం అక్కడి నుంచి అల్వార్కు సమీపంలోని బిటెడా అనే గ్రామానికి చేరుకున్నాడు. రాత్రి పూట ఇంటికెళ్లి తలుపుకొట్టగా తండ్రి వచ్చి తీశాడు. అలా చనిపోయాడనుకున్న తన కుమారుడు తిరిగి కనిపించడంతో అతడు ఓ క్షణంపాటు ఖిన్నుడయ్యాడు. వెంటనే తేరుకుని ఆనందభాష్పాలతో అతడిని హత్తుకున్నాడు. ఇంట్లో మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. తన ఇద్దరు కుమార్తెలను గుర్తుపట్టేందుకు ధర్మేందర్ చాలా కష్టపడ్డాడు. సోదరులు, బంధువులు అతడి రాకపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వైద్య చికిత్సల కోసం ప్రస్తుతం అతడిని జైపూర్ తీసుకెళ్లారు.

>
మరిన్ని వార్తలు