వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?

5 Dec, 2015 16:07 IST|Sakshi
వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?
శ్రీనగర్:  అతనో వీర జవాన్... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో  దేశం కోసం ప్రాణాలను పణంగా  పెట్టిన సైనికుడు. దేశ సరిహద్దు ప్రాంతంలో శత్రువు కెదురొడ్డి వీరోచితంగా పోరాడిన  యోధుడు. మరి అలాంటి యోధుడే.. ఇపుడు  దేశద్రోహిగా మారిపోయాడా.. దేశానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను దేశం దాటించే ప్రయత్నం చేశాడా ..వీర జవాన్ కాస్తా గూఢచారిగా మారిపోయాడా.. జమ్ము కశ్మీర్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. 
 
జమ్ము కశ్మీర్ కు చెందిన మాజీ సైనికుడు మున్వర్ అహ్మద్ మీర్  ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు  సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు.  ఢిల్లీ క్రైం  బ్రాంచ్ , జమ్ము కశ్మీర్ పోలీసుల  సంయుక్త ఆధ్వర్యంలో  ఈ పరిణామం చోటు చేసుకుంది.  రాజౌరి జిల్లా నివాసి అయిన మీర్పై  అధికార రహస్య చట్టం కింద  కేసులు నమోదయ్యాయి.
 
 కొన్ని రహస్య ప్రతాలను, కీలక సమాచారానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చేరవేశాడని పోలీసులు భావిస్తున్నారు.  కీలకమైన  సమాచారాన్ని  ఉగ్రవాద సంస్థకు అందించాడని  తమ విచారణలో తేలిందని  నిఘా  విభాగం అధికారులు తెలిపారు.  ఈ కేసులో   రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా అరెస్టు చేసినట్లు రాష్ట్ర డీజిపి వెల్లడించారు.  స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన   అనంతరం వీరిని  రిమాండ్ కోసం  ఢిల్లీకి తరలించామన్నారు. 
 
అయితే  తనపై వచ్చిన ఆరోపణలను మాజీ సైనికుడు అహ్మద్ మిర్  ఖండించాడు. ఈ  కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలతో తనను అన్యాయంగా  ఇరికించారని వాదిస్తున్నాడు.  కాగా మాజీ  సైనికుడు మిర్  అధికార పీడీపీలో చురుకైన కార్యకర్త అని తెలుస్తోంది.
>
మరిన్ని వార్తలు