చర్చలతోనే పరిష్కారం

8 Sep, 2016 03:34 IST|Sakshi
చర్చలతోనే పరిష్కారం

 న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ సమస్య పరిష్కారంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం కావాల్సిన అవసరం ఉందని అఖిలపక్షం సూచించింది. రెండ్రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన బృందం సభ్యులు సమావేశమయ్యారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొనే చర్యలతోపాటు.. ప్రజల్లో విశ్వాసం కల్పించేలా కార్యాచరణ ప్రారంభించాలని సభ్యులు సూచించారు. దీంతోపాటు పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని కూడా పలువురు సభ్యులు తెలిపారు. కశ్మీరీ ప్రజలు కూడా హింసను పక్కనపెట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలన్నారు.

నాగరిక సమాజంలో ఇలాంటి హింసకు తావుండకూడదని.. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తున్నట్లు తాము విశ్వస్తిన్నామన్నారు.  దీనిపై అఖిలపక్షానికి నాయకత్వం వహించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. లోయలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు భారత సార్వభౌమత్వానికి ఇబ్బంది కలగకుండానే చర్యలు చేపడతామన్నారు. సమావేశం తీర్మానాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. వేర్పాటువాదులతో చర్చలు జరపాలని అఖిలపక్షం చేసిన సూచనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే.. హురియత్ నేతల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కాగా, సమావేశంలో అన్ని పక్షాలు చర్చల విషయంపై ఏకాభిప్రాయానికి రాగా.. వామపక్ష పార్టీలు మాత్రం పాకిస్తాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని ప్రతిపాదించాయి. కాగా, కశ్మీర్‌లో పరిస్థితిని అదుపుచేయటంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మజ్లిస్ ఎంపీ ఒవైసీ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు లేని నిజనిర్ధారణ కమిటీని మరోసారి కశ్మీర్‌కు పంపి ప్రజలతో మాట్లాడిస్తే.. సమస్యకు పరిష్కారం దొరకొచ్చన్నారు.

 కొండను తవ్వి..
కశ్మీర్‌లో అఖిలపక్షం పర్యటించటం ద్వారా లాభమేమీ జరగలేదని.. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. ‘జమ్మూకశ్మీర్‌లో అఖిలపక్షం పర్యటన ద్వారా ఒక చిన్న మంచి విషయాన్ని కూడా సాధించినట్లు నాకు అనిపించటం లేదు. వివిధ పార్టీలు కశ్మీర్‌కు రాకుండా కూడా ఓ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చు. అనవసరంగా అక్కడ పర్యటన పేరుతో డబ్బులు, సమయం వృథా అయ్యేవి కావు’ అని ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్యకు భాగస్వామ్య పక్షాల(వేర్పాటువాదులు)తో సమావేశం కావటం కీలకమైన పరిణామమని సీపీఎం నేత తరిగామి తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే సీనియర్ ఎంపీలతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.

 కశ్మీర్‌లో మళ్లీ అల్లర్లు.. అఖిలపక్షం పర్యటన సందర్భంగా రెండ్రోజుల పాటు శాంతిగా కనిపించిన లోయలో మళ్లీ అల్లర్లు తలెత్తాయి. తాజా గొడవల్లో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కశ్మీర్‌లో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. శ్రీనగర్ తప్ప మిగిలిన ప్రాంతాల్లోనే గొడవలు జరిగాయి. కాగా, శ్రీనగర్‌లో సాయంత్రం ఆరునుంచి 12 గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేశారు.

మరిన్ని వార్తలు