మా విమానాలూ ఎక్కనివ్వం

17 Jun, 2017 01:35 IST|Sakshi
- జేసీపై మరిన్ని విమానసంస్థల నిషేధం
- సీసీటీవీ ఫుటేజీల్లో అంతా స్పష్టం: మంత్రి అశోక్‌
 
న్యూఢిల్లీ/విజయవాడ/విజయనగరం గంటస్తంభం: విశాఖ ఎయిర్‌పోర్టులో జులుం ప్రదర్శించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై దాదాపు అన్ని దేశీయ విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. ఆలస్యంగా వచ్చిన తనను బోర్డింగ్‌కు అనుమతించలేదని ఇండిగో సంస్థ సిబ్బందిపై ఎంపీ జేసీ వీరంగం వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండిగో, ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ జేసీపై నిషేధం విధించగా.. శుక్రవారం విస్తారా, గోఎయిర్, ఎయిర్‌ఆసియా ఇండియా సంస్థలు జేసీని తమ విమానాలు ఎక్కనివ్వబోమని చెప్పాయి. కాగా, ప్రస్తుత ఘటనపై క్షమాపణలు చెబుతారా అని విలేకరులు జేసీని హైదరాబాద్‌లో ప్రశ్నించగా.. తానేమీ మాట్లాడనని, చెప్పడానికి ఏమీ లేదని వెళ్లిపోయారు. 
 
సీసీ కెమెరాలు చెబుతాయి..
జేసీ ఉదంతంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీలు అన్ని వివరాలను బయటపెడతాయని చెప్పారు. ఎంపీ అయినా, సాధారణ పౌరుడికైనా, చివరకు తనకైనా భద్రత నిబంధనలు ఒక్కేనన్నారు. 45 నిమిషాల ముందే కౌంటర్లు మూసివేయాలనే నిబంధన ఉందని, ఆ సమయంలో జేసీ అక్కడకు చేరుకోలేదనే విషయం సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు విజయనగరంలో మంత్రి అశోక్‌ మాట్లాడుతూ.. జేసీ విషయంలో తనకేం సంబంధం ఉండదని, అధికారులే అంతా చూసుకుంటారన్నారు.
మరిన్ని వార్తలు