కొన్ని చోట్ల ఎక్కువ కేసులు

12 May, 2020 03:13 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయనీ, ఈ దశలో వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడం కీలకమని కేంద్రం పేర్కొంది. దేశంలో 24 గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో 4,213కు చేరుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడారు. ‘దేశంలోని కొన్ని క్లస్టర్లతోపాటు, కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిని సమర్థంగా కట్టడి చేయకుంటే వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుంది’అని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్‌ ప్రభుత్వం మత ప్రాతిపదికన కరోనా హాట్‌స్పాట్లను గుర్తించే ప్రయత్నం చేస్తోందంటూ వస్తున్న వార్తలును  కొట్టిపారేశారు. దేశీయంగా రూపొందించిన ఎలిసా టెస్ట్‌ కిట్‌ 97 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని అగర్వాల్‌ స్పష్టం చేశారు.

విమాన ప్రయాణికులకూ ఆరోగ్యసేతు
విమాన ప్రయాణికులు కూడా తమ మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ యాప్‌ లేని ప్రయాణికులను విమానంలోకి అనుమతించబోరని చెప్పారు. పౌర విమాన యాన శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, కరోనా కేసులు అత్యధికంగా ఉన్న నగరాల్లో రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌(గుజరాత్‌)లో వ్యాప్తి కట్టడికి చెల్లింపులను కరెన్సీ నోట్ల రూపంలో కాకుండా డిజిటల్‌ ద్వారానే జరపాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు