‘టవర్ల’కు సొసైటీలు నో..

4 Nov, 2014 23:29 IST|Sakshi
‘టవర్ల’కు సొసైటీలు నో..

 సాక్షి, ముంబై: నగరంలో మొబైల్ ఫోన్ వినియోగదారులకు త్వరలో గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం ఉంది. మొబైల్ టవర్లు ఏర్పాటుకు అనేక సొసైటీలు నిరాకరిస్తున్నాయి. కొందరు కుదుర్చుకున్న ఒప్పందం (అగ్రిమెంట్) ను పొడగించేందుకు ముఖం చాటేస్తున్నారు.

 మొబైల్ టవర్ల నుంచి వెలువడే ప్రమాదకర రేడియేషన్‌కు భయపడే వారు తమ అగ్రిమెంట్లను పునరుద్ధరించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొబైల్ సేవలు అందించే వివిధ సంస్థలు కొత్త సొసైటీలు, ఖాళీ స్థాలాల వేటలో పడ్డాయి. నగరంలో దాదాపు మూడు కోట్ల నాలుగు లక్షల మొబైల్ వాడకం దారులున్నారు. ప్రతి నెలా సుమారు 70 వేల నుంచి లక్ష వరకు కొత్త వినియోగదారులు తోడవుతున్నారు. ప్రతి 20 వేల వినియోగదారులకు ఒక మొబైల్ టవర్ అవసరముంటుంది. ప్రస్తుతం ముంబైలో 9,500 మొబైల్ టవర్లున్నాయి.

వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో టవర్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ప్రస్తుతం అదనంగా 670 టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ పేర్కొంది. సొసైటీలు, బహుళ అంతస్తుల భవనాలపై ఏర్పాటుచేసే సెల్‌ఫోన్ టవర్ల ఒప్పందం ఐదేళ్లు ఉంటుంది. కాని ఈ కాలవ్యవధి పూర్తయిన తరువాత గడువు పొడగించి ఇచ్చేందుకు అనేక సొసైటీలు నిరాకరిస్తున్నాయి.

సెల్ టవర్లు ఏర్పాటుచేయడంవల్ల అందులోంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందని వివిధ సేవా సంస్థలు గత రె ండు, మూడు సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాయి. దీంతో కాని వీటిని ఏర్పాటు చేయడంవల్ల సొసైటీలకు మంచి ఆదాయం వస్తుంది. కాని స్వయం సేవా సంస్థల ప్రచారం వల్ల టవర్లు ఏర్పాటుకు అనుమతివ్వడానికి సొసైటీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్  వర్గాలు పేర్కొన్నాయి.

 ప్రస్తుతం నగరంలో కొత్తగా 670 సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముండగా కేవలం 105 టవర్లకు స్థలం లభించింది. మిగతా టవర్ల ఏర్పాటుకు స్థలం వేటలో పడ్డాయి. ఇదిలా ఉండగా, సొసైటీ యాజమాన్యాలు సెల్ టవర్లను ఇలాగే నిరాకరిస్తూ పోతే కొద్ది రోజుల్లో సాధారణ ఫోన్లతోపాటు ఖరీదైన టూ జీ, త్రీ జీ లాంటి సేవలు  నెట్‌వర్క్ లేక ఫొన్లు మొరాయించే పరిస్థితి ఎదురుకావడం ఖాయమని అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు