తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!

7 Apr, 2020 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించడం తప్ప మరో దారి లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనుంది. ఓ వైపు దీనికి గడువు దగ్గరపడుతుండగా.. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఈనెల 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

‘రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నందున  మరో రెండు వారాల పాటు(ఏప్రిల్‌ 15 తరువాత) లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధాని మోదీని కోరబోతున్నా. ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. తెలంగాణలో మాత్రం అమల్లో ఉంటుంది’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా కేసీఆర్‌ బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర ( 891), తమిళనాడు (571), ఢిల్లీ (525) రాజస్తాన్‌ (323) కేరళ (295) ఉత్తరప్రదేశ్‌ (301), మధ్యప్రదేశ్‌ (230), రాష్ట్రాలు కూడా మరికొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. (లాక్‌డౌన్‌ పొడిగించాలి)

దీనిపై ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉందంట ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్‌ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసుల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌, స్వీయ నిర్బంధం వంటి చర్యలతో కొంతమేర నివారించగలింది. ఈ క్రమంలోనే ప్రజలు మరోసారి జస సంచారంలోకి వస్తే అసలుకే మోసం వస్తుందని ముఖ్యమం‍త్రి ఉద్ధవ్‌ ఠాక్రే భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేతపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై ప్రభుత్వం పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పరిస్థితుల సాధారణ స్థితికి చేరుకునే వరకు ఎదురుచూస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా పరిస్థితులపై హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం కేంద్రమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌ 14 తరువాత తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. అయితే  కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను రెడ్‌జోన్లుగా గుర్తించి.. మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలను తొలగిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం లాక్‌డౌన్‌ ఎత్తివేతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు