నా మీదకు కుక్కల్ని వదిలేవాడు..

12 Jun, 2015 08:08 IST|Sakshi
సోమ్‌నాథ్ భారతి భార్య లిపిక

సోమ్‌నాథ్ భారతిపై భార్య తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు బుధవారం చేసిన 26 పేజీల ఫిర్యాదులో ఆమె పలు ఆరోపణలు చేశారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త తనపైకి కుక్కల్ని వదిలేవాడని.. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడని ఆమె ఆరోపించారు. తాను మూడోసారి గర్భవతి అయినప్పుడు ఏడో నెలలో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడని, ఈ బాధ భరించలేక తాను తన మణికట్టును కోసుకోవటానికి ప్రయత్నించినట్లు ఆమె ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

షాదీ డాట్ కామ్ ద్వారా ఈ ఇద్దరూ కలుసుకున్నారని.. తనకు అంతర్జాతీయ న్యాయ సంస్థ ఉన్నట్లు సోమ్‌నాథ్ భారతి లిపికకు అబద్ధం చెప్పారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ చెప్పారు. కాగా, లిపిక శుక్రవారం తన భర్తపై పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.  అయితే సోమ్‌నాథ్.. భార్య ఆరోపణలను ఖండించారు. ఇవన్నీ అబద్ధాలని, తాను తన భార్యను, పిల్లలను అమితంగా ప్రేమిస్తున్నానని తెలిపారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భారతి భేటీ అయి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు