సోమ్‌నాథ్‌ చటర్జీ కన్నుమూత

13 Aug, 2018 09:22 IST|Sakshi
లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ (ఫైల్ ఫోటో)

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

భారత రాజకీయాల్లో మేరునగధీరుడైన సోమనాథ్‌ చటర్జీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలమైన గళం వినిపించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సోమనాథ్‌ చటర్జీ ఓ వ్యవస్థ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంటేరియన్లు అందరూ ఆయనను గౌరవించేవారని గుర్తు చేశారు. సోమనాథ్‌ చటర్జీ మృతికి రాహుల్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు.

వైఎస్ జగన్‌ సంతాపం
సోమనాథ్‌ చటర్జీ మరణం పట్ల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. పార్లమెంట్‌లో విలువలకు కట్టుబట్టారని, ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణంతో నీతి, విలువల కలిగిన గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని సంతాప సందేశంలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ట్విటర్‌లోనూ సోమనాథ్‌ చటర్జీకి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు