సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్‌

12 Mar, 2019 11:05 IST|Sakshi

ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత రాధాకృష్ణవిఖే పాటిల్‌ కుమారుడు సుజయ్‌ విఖే పాటిల్‌ మంగళవారం బీజేపీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాను పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న అహ్మద్‌నగర్‌ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నిరాకరించడంతో నిరాశ చెందిన సుజయ్‌ బీజేపీ గూటికి చేరాలని నిర్ణయించారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా అహ్మద్‌నగర్‌ స్ధానాన్ని కాంగ్రెస్‌ ఎన్సీపీకి కేటాయించింది. కాగా ఈసారి ఇదే స్ధానాన్ని సుజయ్‌ పాటిల్‌కు ఇచ్చేందుకు ఎన్సీపీ నిరాకరిస్తోంది. న్యూరోసర్జన్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న సుజయ్‌ ఇదే స్ధానం నుంచి పోటీ చేసేందుకు పట్టుబడుతున్నారు. కాగా మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అశోక్‌ చవాన్‌ మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌తో ఇదే విషయంపై సంప్రదింపులు జరిపారు.

సుజయ్‌ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ పార్టీ పరిశీలిస్తోందని, అతడికి ఏదో విధంగా సర్ధిచెప్పాలని ఈ సందర్భంగా అశోక్‌ చవాన్‌, రాధాకృష్ణ పాటిల్‌కు నచ్చచెప్పినట్టు సమాచారం. మరోవైపు తనకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని వెల్లడించిన సుజయ్‌ పాటిల్‌ గతవారం బీజేపీ నేత గిరీష్‌ మహాజన్‌ను కలవడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

మరిన్ని వార్తలు