జుహూ బీచ్‌ను చూడండి.. ఎలా ఉందో : నటి

10 Sep, 2019 18:24 IST|Sakshi

ముంబై : గణేష్‌ చతుర్థి పండుగ సందర్భంగా లక్షల సంఖ్యలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్‌ విగ్రహాలను సముద్రాలు, నదులలో నిమజ్జనం చేస్తుండటం వల్ల పర్యావరణానికి తీరని హాని కలుగుతోందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతుండటం తెలిసిందే. ఈ విషయంలో చైతన్యం తీసుకురావడానికి ఎంత ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల వల్ల సముద్ర జలాలు కలుషితం అవుతుండటంపై తాజాగా ప్రముఖ నటి సోనాలి బింద్రె ఆవేదన వ్యక్తం చేశారు. జుహూ బీచ్‌లో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయగా అక్కడ ఏర్పడిన విగ్రహా వ్యర్థాలు, ఇతర పూజా సామాగ్రిని ఓ చోట కుప్పగా పోసిన ఆ ఫోటోను ఆమె ట్విటర్‌లో పోస్టు చేశారు.

‘నిన్న జహూ బీచ్‌లో గణేష్‌ నిమజ్జనం తర్వాత తీసిన ఫోటో ఇది. ఇవి మనకు నష్టం కలిగించే సంకేతాలు కాకపోతే మరేంటో నాకు తెలియదు. ఇలా జరగకూడదు. ఇంతకన్నా మనం బాగా చేయాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్‌ చేశారు. దీంతో పర్యావరణహితంగా గణేష్‌ చతుర్థిని తాము ఎలా జరుపుకున్నామో చెబుతూ కొందరు ఆమెకు రిప్లై ఇచ్చారు. వారి రిప్లైలకు సంతోషం వ్యక్తం చేసిన సోనాలి బింద్రే సంప్రదాయ దుస్తులు ధరించి గణేష్‌ వేడుకల్లో పాల్గొన్న మరొక ఫోటోను షేర్‌ చేశారు. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ వల్ల గత సంవత్సరం గణేష్‌ ఉత్సవాలలో పాల్గొనలేదని, ఈ సంవత్సరం తన కుటుంబసభ్యులతో కలసి ఉత్సాహంగా పోల్గొన్నానని ఆమె తెలిపారు. పర్యావరణహితంగా గణేష్‌ పండుగను జరుపుకోవాలని, అదే నిజమైన పండుగ స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు.

ఇక, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాల వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రధాని మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  పర్యావరణానికి హానీ కల్గించే విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయరాదని ఆయన ప్రజలను కోరారు. గణేష్‌ విగ్రహాలు, ఇతర పూజా సామాగ్రి వల్ల నదులు, సముద్రాలు కలుషితం అవుతున్నాయని, కాలుష్యాన్ని తగ్గించే సమయం ఆసన్నమైందని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది చదవండి : శోభాయాత్ర సాగే మార్గాలివే..!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా