మేమిచ్చాం.. బీజేపీ వెనక్కి తీసుకుంది

31 Mar, 2016 03:27 IST|Sakshi
మేమిచ్చాం.. బీజేపీ వెనక్కి తీసుకుంది

అస్సాంకు ప్రత్యేక హోదాపై సోనియా విమర్శ
 
 శివనగర్/అంగురి:
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మత, విభజన రాజకీయాలు రాజ్యమేలతాయని బుధవారం శివనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ‘తేయాకు తోటల కార్మికులకు అచ్చేదిన్ తీసుకురాకుండా.. అస్సాం టీ అమ్మానని చెబితే ఓట్లేస్తారా?’అని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నారు. 15 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనలో రాష్ట్ర శాంతి సుసంపన్నత కోసం కృషి చేశామని పేర్కొన్నారు. అస్సాంకు యూపీఏ ప్రత్యేక హోదా ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం దీన్ని వెనక్కు తీసుకుందని అన్నారు.

 తిరుగుబాట్లు కట్టడి చేశాం: రాజ్‌నాథ్
 కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అస్సాంలో తిరుగుబాట్లు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అస్సాంలోని దులియాజన్‌ల  ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఆయుధాలు వదిలి.. చర్చలకు రావాల్సిందిగా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపామన్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబాట్లను, నకిలీ కరెన్సీని పూర్తిగా అరికట్టినట్లు తెలిపారు.

 సీపీఎం మోసం చేసింది: గౌరి
 తిరువనంతపురం: సీట్ల కేటాయింపులో సీపీఎం తమను మోసం చేసిందని కమ్యూనిస్టు నాయకురాలు, జనతిపథియ సంరక్షణ సమితి (జేఎస్‌ఎస్) చీఫ్ గౌరి (97) విమర్శించారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.  కేరళలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ చీఫ్ అమిత్ షా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి  నడ్డా వెల్లడించారు.

 జంతువులతో ఓటర్లకు అవగాహన!
 కోల్‌కతా: ఓటర్లలో అవగాహన పెంచేందుకు పశ్చిమబెంగాల్ ఎన్నికల సంఘం వినూత్నంగా ముందుకెళ్తోంది. బెంగాల్‌కు పేరు తెచ్చిన ప్రకృతి ప్రాంతాలు, జంతువులతో మస్కట్లు (పులి, రెడ్ పాండా, ఖడ్గమృగం, డాల్ఫిన్ వంటివి) రూపొందించి.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. 24 పరగణాల జిల్లాలో పులికి బెంగాలీ స్టైల్లో తెల్లని ధోవతీ కట్టి ‘మీ ఓటు బహుమూల్యం’ అని మస్కట్లను రూపొం దించింది. మరో చోట రెడ్ పాండాలతో ‘మనమంతా ఓటు వేద్దాం’ అని పోస్టర్లు రూపొందించి ప్రచారం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు