‘అంతకు మించిన దేశభక్తి మరోకటి లేదు’

14 Apr, 2020 09:01 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనాకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశంసించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను కొనియాడుతూ మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు. వారు వ్యక్తిగత లాభం చూసుకోకుండా ప్రజల కోసం కరోనాపై పోరాడుతున్నారని తెలిపారు.  కరోనా పోరాట యోధులకు ధన్యవాదాలు తెలుపడానికి మాటలు సరిపోవని అన్నారు. అలాగే ప్రజలు భౌతిక దూరం, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. కరోనాపై పోరాటంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజలకు తోడుగా ఉంటారని చెప్పారు. 

‘ఈ సంక్షోభ సమయంలో వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల, ప్రభుత్వ అధికారుల పోరాట పటిమకు మించిన దేశభక్తి మరోకటి లేదు. ప్రాథమిక భద్రత వనరులు లేకపోయినా మన పోరాట యోధులు కరోనాతో యుద్ధం చేస్తున్నారు. సరిపడ ప్రొటెక్షన్‌ కిట్స్‌ అందుబాటులో లేపోయినా వైద్యులు, ఆరోగ్య  కార్యకర్తలు, వాలంటీర్లు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌కు కట్టుబడి.. భౌతిక దూరం నిబంధనలను పాటించాలి. జవాన్లు, పోలీసులు లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేస్తున్నారు. సరైన సదుపాయాలు లేకపోయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వ అధికారులు కూడా చాలా శ్రమిస్తున్నారు.

కానీ మన మద్దతు లేకపోతే.. వారు వారి విధులను నిర్వర్తించలేరు. కొన్నిచోట్ల వైద్యులపై దాడులు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది మన సంస్కృతికి విరుద్ధం. మనం ఈ పోరాటంలో వారికి మద్దతుగా నిలవాలి. మీలో చాలా మంది వ్యక్తిగతంగా కరోనాపై పోరాటం చేస్తున్నారు. కొందరికి శానిటైజర్లు, మాస్క్‌లు పంచడం, రేషన్‌ అందించడం వంటివి చేస్తున్నారు. మీరందరు కూడా ప్రశంసలు అందుకోవడానికి అర్హులే. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. ప్రతి రాష్ట్రంలో మా పార్టీ కార్యకర్తలందరు ఈ పోరాటంలో మీకు తోడుగా ఉంటారు’ అని సోనియా గాంధీ తెలిపారు. 

కాగా, సోమవారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. లాక్‌డౌన్‌ వల్ల ఎవరు కూడా ఆకలితో బాధపడకుండా చూడాలని కోరారు. పేదలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పేదలకు చేయూతనిచ్చే ఉచిత సరఫరా పథకం బాగుందని ప్రశంసించారు. ఈ పథకాన్ని సెప్టెంబరు వరకు కొనసాగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేశ్యాప్తంగా 21 రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌ గడువు నేటితో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించి ప్రధాని మోదీ నేడు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

చదవండి : ఆ పథకం బాగుందంటూ సోనియా ప్రశంస

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు