‘తెలంగాణ’ సభకు సోనియా

22 Feb, 2014 01:32 IST|Sakshi
‘తెలంగాణ’ సభకు సోనియా

   తప్పకుండా వస్తానన్న కాంగ్రెస్ అధినేత్రి
     మార్చి 2, లేదా 3న హైదరాబాద్‌లో భారీ సభ
     ఆలోచించే విభజన.. తెలంగాణలో పార్టీని కాపాడండి
     సీమాంధ్రులను గాయపరచొద్దు : సోనియా హితవు
     కాంగ్రెస్‌ను గెలిపించి కానుకిస్తాం: టీ నేతలు
 
 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో మార్చిలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పాటు సుమారు 60 మంది 10,జనపథ్‌కు వెళ్లి సోనియాను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం మేరకు... తెలంగాణ ప్రజలంతా మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఎదురు చూస్తున్నారని సోనియాతో జానా, గీతారెడ్డి అన్నారు. ఆమె వీలును బట్టి మార్చి 2, లేదా 3 తేదీల్లో భారీ బహిరంగ సభ తలపెట్టినట్టు చెప్పారు. సోనియా సానుకూలంగా స్పందించారు. ‘తప్పకుండా వస్తా. తెలంగాణ ప్రజలను కలవాలనుకుంటున్నా. ఏ రోజు వచ్చేది మళ్లీ చెబుతా.
 
 మీరు దిగ్విజయ్‌సింగ్‌తో టచ్‌లో ఉండండి’ అని బదులిచ్చారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం జరిగినా, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ వాగ్దానాన్ని అమలు చేశామని సోనియా అన్నారు. అయితే తనకు సీమాంధ్రపై ద్వేషం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇకపై సీమాంధ్ర మనసులు గాయపడేలా ఎవరూ మాట్లాడొద్దు. వాళ్లు కూడా నాకు సోదర సమానులే. రాగద్వేషాలకు తావులేకుండా అన్నదమ్ముల్లా కలిసుంటూ ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేసుకోండి’’ అని హితవు పలికారు. తెలంగాణలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలంతా కాంగ్రెస్‌కు రుణపడి ఉంటారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి కానుకగా ఇస్తామని నేతలు బదులిచ్చారు. రాష్ట్రపతి పాలన అంశాన్ని ఒకరిద్దరు ప్రస్తావించినాసోనియా పెదవి విప్పలేదు.
 
 ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు
 సోనియాను కలిశాక నేతలంతా ఏపీ భవన్‌లో సమావేశమయ్యారు. హైదరాబాద్ బహిరంగ సభకు జన సమీకరణ తదితరాలపై చర్చించుకున్నారు. కనీవినీ ఎరగని రీతిలో జనాన్ని తీసుకు రావాలనుకున్నారు. జిల్లాలవారీగా ఎవరు ఎంతమందిని సమీకరించాలన్నదీ చర్చకు వచ్చింది. ‘‘ఆదివారం మధ్నాహం ఒంటిగంటకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్క్ వద్దకు వెళ్దాం. అమరవీరులకు నివాళులర్పించి గాంధీభవన్‌కు వెళ్లి కార్యకర్తలతో సమావేశమవుదాం’’ అని తీర్మానించారు.
 
 ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, ప్రసాద్‌కుమార్, ఎంపీలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్ నేతలు కె.ఆర్.సురేశ్‌రెడ్డి, బి.కమలాకరరావు, మల్లు రవి తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఆయా నేతలతో కలసి జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఊరూరా విజయోత్సవ సభలు నిర్వహించి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.
 
 దిగ్విజయ్‌తో భేటీ
 అంతకుముందు నేతలు దిగ్విజయ్‌ను కలసి బహిరంగ సభ తేదీ ఖరారుపై చర్చించారు. మార్చి 5-15 మధ్యలో పెట్టుకోవాలని ఆయనన్నారు. ఆలోపే ఎన్నికల షెడ్యూల్ రావచ్చని నేతలనడంతో తొలి వారంలోనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విభజనపై గెజిట్ నోటిఫికేషన్ రాగానే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు.
 
 రాష్ట్రపతి పాలన రాదు
 సోనియాతో భేటీ తర్వాత టీ మంత్రుల వ్యాఖ్య
 ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు ఆస్కారమే లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. కచ్చితంగా కొత్త ముఖ్యమంత్రి వస్తారని, ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లోక్‌సభతో పాటే ఎన్నికలు జరుగుతాయన్నారు. శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలసిన అనంతరం తెలంగాణ మంత్రులు, సీనియర్ నేతలు ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పాలన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు దామోదర్ స్పందిస్తూ, కాంగ్రెస్‌కు అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో మెజారిటీ ఉందన్నారు. సీమాంధ్రలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడి నేతలు చెబుతున్న అంశాన్ని ప్రస్తావించగా... వారికి తప్పకుండా మద్దతు ఇస్తామని ఆయన బదులిచ్చారు. రెండు రాష్ట్రాలైనా తామంతా కాంగ్రెస్ వాళ్లమేనన్నారు.
 
 అసెంబ్లీ ఎన్నికలను ఆర్నెల్ల పాటు వాయిదా వేయాలన్న డిమాండ్లను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎం కిరణ్ కూడా కాంగ్రెస్‌ను తిడుతున్నారుగా అని ప్రశ్నించగా, ‘‘కిరణ్ ఏ రకంగా వచ్చాడో ఆ రకంగానే మాయమయ్యాడు. ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సిందేముంది?’’ అంటూ బదులిచ్చారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అంశాన్ని అధిష్టానం పెద్దలు చూసుకుంటున్నారని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.
 
 విలీనానికి ముందే కేసీఆర్‌కు చెక్!
 కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం కాకముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఘనతను చాటుకునే విషయంలో టీఆర్‌ఎస్ కన్నా ముందుండటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో భారీ సభ ప్రకటన అందులో భాగమేనంటున్నారు. పైగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ జేఏసీ నేతలను శుక్రవారం సోనియాగాంధీతో కలిపించారు. వారు కేవలం టీఆర్‌ఎస్‌తోనే లేరని, రాజకీయేతర శక్తిగా కాంగ్రెస్ సహా ఎవరితోనైనా కలసి పని చేస్తారని, తెలంగాణ ఇచ్చాక విలీనాలతో పని లేదని మేడమ్‌కు సూచించడమే వారి ఉద్దేశమంటున్నారు. తెలంగాణలో భారీ సభ పెట్టి, దానికి సోనియాను ఆహ్వానించాలన్న కేసీఆర్ యోచనను పసిగట్టిన నేతలు, అంతకంటే ముందే తామే బహిరంగ సభ ప్రకటన చేశారు. కేసీఆర్ కూడా మార్చిలోనే సభ పెడుతున్నారంటూ దిగ్విజయ్‌కి చెప్పి మరీ, అంతకుముందే సభ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ పొందారు. మొత్తానికి విలీనానికి ముందే టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ తన మార్కు రాజకీయాలను రుచి చూపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు