రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్‌ పార్టీ బృందం

27 Feb, 2020 14:45 IST|Sakshi

న్యూఢిల్లీ: తన విధులను విస్మరించి దేశ రాజధానిలో చెలరేగిన హింసకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో 34 మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపందాల్చిన నేపథ్యంలో.. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు. రాష్ట్రపతిగా ఉన్న అధికారాలను వినియోగించి రాజ ధర్మాన్ని నిర్వర్తించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను.. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన విధులను గుర్తు చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోం మంత్రిని పదవి నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. (ఢిల్లీ అల్లర్లు : 35కు చేరిన మృతుల సంఖ్య)

ఈ క్రమంలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ... హోం మంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా కొత్తగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తీరును కూడా ఆమె తప్పుబట్టారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ... రాజధర్మాన్ని కాపాడాల్సిందిగా రాష్ట్రపతికి విఙ్ఞప్తి చేశామని తెలిపారు. ఢిల్లీలో చెలరేగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, అహ్మద్‌పటేల్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా తదితరులు సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లతో కలిసి రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉన్నారు. (ఢిల్లీ అల్లర్లు: అం‍కిత్‌ శర్మ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

ఢిల్లీ అల్లర్లు: సమగ్ర కథనాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు