-

సోనియా, రాహుల్ నకిలీ గాంధీలు: వెంకయ్య నాయుడు

17 Apr, 2014 04:21 IST|Sakshi
సోనియా, రాహుల్ నకిలీ గాంధీలు: వెంకయ్య నాయుడు

పాట్నా: కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు జాతిపిత మహాత్మా గాంధీతో ఎలాంటి సంబంధమూ లేదని, వారిద్దరూ నకిలీ గాంధీలు అని బీజేపీ ధ్వజమెత్తింది. ‘వారి కుటుంబానికి గాంధీ ఇంటిపేరును వాడుకునే హక్కు లేదు. వారిద్దరూ నకిలీ గాంధీలు. స్వాతంత్య్రోద్యమ నిర్మాత వారసత్వాన్ని దక్కించుకోవడానికే ఆయన ఇంటి పేరు పెట్టుకున్నారు’ అని పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారమిక్కడ విలేకర్లతో అన్నారు.
 
 అయితే ఈ విమర్శ ద్వారా ఆయన అనుకోకుండానే స్వపక్ష నేతలైన మేనకా గాంధీ, వరుణ్ గాంధీలు గాంధీ ఇంటి పేరును వాడుకోడాన్ని ప్రశ్నించినట్లయింది. కాగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ 650 ప్రభుత్వ పథకాలకు గాంధీ వంశంలోని మూడు తరాల వారి పేర్లు పెట్టడాన్ని సమీక్షిస్తుందని వెంకయ్య చెప్పారు. ‘దేశానికి ఆ కుటుంబం తప్ప మరే నాయకుడూ మేలు చేయనట్లు 650 కాంగ్రెస్ పథకాలకు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టింది’ అని మండిపడ్డారు. మోడీ బీజేపీ సీనియర్ నేతలను గౌరవించడం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్పందిస్తూ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళి అర్పించేందుకు ఆయన చితాభస్మాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకురావడానికి కాంగ్రెస్ అనుమతించలేదన్నారు.

మరిన్ని వార్తలు