హెరాల్డ్ కేసులో...సోనియా,రాహుల్‌కు ఊరట

13 Feb, 2016 00:50 IST|Sakshi
హెరాల్డ్ కేసులో...సోనియా,రాహుల్‌కు ఊరట

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్  చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరికీ ట్రయల్ కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి సుప్రీం కోర్టు మినహాయింపునిచ్చింది. ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టులో కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే మెజిస్ట్రేట్ ఎప్పుడు అవసరమని భావించినా వ్యక్తిగతంగా హాజరు కావాలని సోనియా, రాహుల్‌ను ఆదేశించవచ్చని షరతు విధించింది. ట్రయల్ కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాన్న సోనియా, రాహుల్  పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరపనుంది.

ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించొద్దనిస్వామి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులోని పరిస్థితులు, పిటిషనర్ల స్థాయిని బట్టి చూసినట్లయితే వారు ట్రయల్ కోర్టుకు హాజరు కావడం వల్ల సౌలభ్యం కన్నా ఇబ్బందులే ఎక్కువ ఉంటాయని  కోర్టు పేర్కొంది. కింది కోర్టులో ఉన్న క్రిమినల్ ప్రొసిడింగ్స్‌లో జోక్యం చేసుకునేందుకు మాత్రం నిరాకరించింది. అయితే ఈ కేసులో నిందితులకు సంబంధించి హైకోర్టు పరిశీలనలు, నిర్ధారణలతో తాము ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది.

>
మరిన్ని వార్తలు