సీఎం కిరణ్ కు సోనియాగాంధీ అక్షింతలు..!

13 Jul, 2013 02:27 IST|Sakshi
సీఎం కిరణ్ కు సోనియాగాంధీ అక్షింతలు..!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజిస్తే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారంటూ జరిగిన ప్రచారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాలపై ఢిల్లీ పెద్దల కదలికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కోర్ కమిటీ సమావేశం జరగనున్న తరుణంలో ఉదయం కిరణ్ తన పదవికి రాజీనామా చేయటానికి సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది.
 
దానిపై జాతీయస్థాయి టీవీ చానళ్లలో కూడా వార్తలు ప్రసారమైన నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ కోర్ కమిటీ భేటీకి ముందుగానే మధ్యాహ్నం హడావుడిగా సోనియా నివాసం 10-జనపథ్‌కు వెళ్లి పార్టీ అధినేత్రిని కలిసి, ఐదు నిముషాల్లోనే బయటకు వచ్చేశారు.
 
సోనియా పిలుపు మేరకు కిరణ్ ఆమె నివాసానికి వెళ్లారని.. రాజీనామా వార్తలపై పార్టీ అధినేత్రి సీఎంను ప్రశ్నించారని తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల విషయంలో సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సోనియాను కిరణ్ కలిసి బయటకు వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కిరణ్ రాజీనామా వార్తల్ని ఖండిస్తూ ప్రకటన విడుదలచేశాయి.
 
తాను రాజీనామా చేస్తానన్నట్లు వచ్చిన వార్తలు అభూత కల్పనలేనని, పార్టీ అధినేత్రికి విధేయుడనని, ఆమె ఆదేశాలను శిరసావహిస్తానని సీఎం పేర్కొన్నారన్నది దాని సారాంశం. ఆ తర్వాత ఢిల్లీలో తనను కలిసిన సీమాంధ్ర నాయకుల వద్ద కూడా తన రాజీనామా వార్తలను సీఎం కొట్టిపారేసినట్లు సమాచారం. ‘నేనెందుకు రాజీనామా చేస్తాను? ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్లు రాసుకుంటున్నారు. అలా రాసిన వాళ్ల ఎజెండా అట్లా ఉందేమో’ అని కిరణ్ వ్యాఖ్యానించినట్లు పార్టీ నేతలు తెలిపారు.   
మరిన్ని వార్తలు