జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ

25 Aug, 2019 13:26 IST|Sakshi

పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని కోల్పోయాం

జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా: సోనియా

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతిపై కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్‌ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను అని పేర్కొన్నారు.

‘జైట్లీ మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన స్వభావంతో పార్టీలకతీతంగా మిత్రులు, అభిమానుల్ని సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది, ప్రతిపక్ష నేత ఇలా ఏ పదవిలో ఉన్నా.. ఆయన గొప్ప వాగ్ధాటి, విజ్ఞతను ప్రదర్శించారు. ఇంకా దేశానికి ఎంతో చేయాల్సి ఉన్న తరుణంలో, చిన్న వయసులో మరణించడం జీర్ణించుకోలేని విషయం. ఈ సమయంలో మాటలు ఓదార్పును చేకూర్చలేవని తెలుసు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను. దేశం గొప్ప ప్రజానాయకుణ్ని కోల్పోయింది. పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని కోల్పోయాం. అరుణ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని సోనియా గాంధీ తన సంతాప సందేశాన్ని సంగీతాకు పంపారు. తీవ్ర అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్‌ జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. 
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు