ఎస్పీజీ చీఫ్‌ సిన్హాకు సోనియా లేఖ

9 Nov, 2019 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ : సుదీర్ఘకాలం పాటు తమకు భద్రత కల్పించినందుకు గానూ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్ సిన్హాకు కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. 28 ఏళ్లుగా ప్రతి రోజూ తాము సురక్షితంగా ఉండటంలో ఎస్పీజీ సభ్యులు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ మేరకు అరుణ్‌ కుమార్‌కు సోనియా లేఖ రాశారు. ‘ ఎస్పీజీ ప్రతిభావంతమైన దళం. ఇందులోని సభ్యులు ఎంతో ధైర్యవంతులు. వారు చేసే ప్రతి పనిలోనూ దేశభక్తి కన్పిస్తుంది. మా కుటుంబ రక్షణను ఎస్పీజీ చేతుల్లో పెట్టిన నాటి నుంచి సురక్షితంగా ఉంటామనే ధీమా కలిగింది. గత 28 ఏళ్లుగా ఎస్పీజీ సభ్యుల అంకితభావం, విధుల పట్ల వారి నిబద్ధత కారణంగా ప్రతీ రోజు మేము క్షేమంగా ఉన్నాం. ఇన్నేళ్లపాటు మాకు రక్షణగా నిలిచినందుకు నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున ఎస్పీజీ గ్రూపు సభ్యులకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ అభినందనలు అని సోనియా లేఖలో పేర్కొన్నారు.(చదవండి : రాహుల్‌ గాంధీ భావోద్వేగపూరిత ట్వీట్‌)

కాగా దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ కుటుంబానికి కల్పిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కారదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలను ఎస్పీజీ నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాల సంరక్షణలోని జడ్‌ ప్లస్‌ కేటగిరీకి మార్చింది. అదే విధంగా ఎస్పీజీలోని దాదాపు 3 వేల మంది సైనికులు ఇకపై దేశ ప్రధాని భద్రతకై సేవలు అందించనున్నారు. ఇక తమకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఎస్పీజీ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా