త్వరలో కొత్త గవర్నర్లు

19 Jan, 2015 02:29 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడు వారాల్లో బీహార్, పంజాబ్, అస్సాం సహా దాదాపు ఆరు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించనున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం బీహార్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపురల్లో గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ ఈ నెల 21న రిటైర్ అవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఊర్మిళ సింగ్ పదవీకాలం జనవరి 24తో ముగుస్తోంది.

తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, ఒడిశా గవర్నర్ ఎస్‌సీ జమీర్ కూడా త్వరలో రిటైర్ కానున్నారు. వారిద్దరినీ యూపీఏ ప్రభుత్వం నియమించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, నాగాలాండ్, గోవాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మోదీ సీఎంగా ఉండగా గుజరాత్ గవర్నర్‌గా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించిన కమల బేణివాల్‌ను మిజోరంకు బదిలీ చేసి, అనంతరం ఆ పదవి నుంచి తొలగించారు.

అలాగే, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను కూడా తొలగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని వారాల తరువాత యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన పలువురిని రాజీనామా చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనిల్ గోస్వామి కోరడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత యూపీఏ నియమించిన గవర్నర్లు షీలా దీక్షిత్(కేరళ), ఎంకే నారాయణన్(పశ్చిమబెంగాల్), అశ్వని కుమార్(నాగాలాండ్), బీఎల్ జోషి(యూపీ), బీవీ వాంఛూ(గోవా), శేఖర్ దత్(ఛత్తీస్‌గఢ్), వీకే దుగ్గల్(మణిపూర్) రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు