‘సౌభాగ్య’ విద్యుత్తు ఉచితం కాదు

28 Sep, 2017 01:41 IST|Sakshi

పేదలకు కనెక్షన్లు మాత్రమే ఫ్రీ, వారు కూడా ప్రతి నెలా బిల్లులు కట్టాల్సిందే

న్యూఢిల్లీ : సౌభాగ్య (సహజ్‌ బిజ్లీ హర్‌ ఘర్‌ యోజన) ద్వారా ఎవ్వరికీ విద్యుత్తును ఉచితంగా సరఫరా చేయబోమని ప్రభుత్వం బుధవారం స్పష్టతనిచ్చింది. పేద కుటుంబాలకు మాత్రమే విద్యుత్తు కనెక్షన్లను ఉచితంగా అందిస్తామనీ, ఆ తర్వాత వారు కూడా ప్రతినెలా బిల్లులు చెల్లించాల్సిందేనని వెల్లడించింది. ఈ పథకం కింద ఇతరులు కొత్తగా విద్యుత్తు కనెక్షన్‌ను తీసుకోవాలంటే రూ.500ను పది వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. సౌభాగ్యకు సంబంధిం చిన ‘తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ)’ను విద్యుత్తు మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది.

దేశంలో విద్యుత్తు సౌకర్యం లేని 4 కోట్ల కుటుంబాలకు 2018 డిసెంబర్‌ నాటికి విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సౌభాగ్యను ప్రారంభించడం తెలిసిందే. రూ.16,320 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పథకం పూర్తైతే ఏడాదికి 28 వేల మెగా వాట్ల అదనపు విద్యుత్తు వినియోగమవుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. యూనిట్‌ విద్యుత్తును రూ.3కు విక్రయిస్తే విద్యుత్తు సంస్థలకు ఏడాదికి రూ.24,000 కోట్ల నిధులు సమకూరుతాయంది.

ఇంటికి దగ్గర్లోని కరెంటు స్తంభం నుంచి ఇంట్లోకి అవసరమైనంత వైరు, విద్యుత్తు మీటరు, ఒక ఎల్‌ఈడీ బల్బు, మొబైల్‌ చార్జింగ్‌ పెట్టుకునేందుకు వీలుగా ఇంట్లో ప్రాథమిక వైరింగ్‌ వరకు అంతా సౌభాగ్య కిందకు వస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంటికి దగ్గర్లో కరెంటు స్తంభం లేకపోతే, ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుని స్తంభాన్ని ఏర్పాటు చేస్తుందంది. ప్రస్తుతమున్న డీడీయూజీఏవై (దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన), ఐపీడీఎస్‌ (ఇంటి గ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీం) నిబంధనల ప్రకారం ఈ వ్యయాలన్నీ వినియోగదారులే భరించాల్సి ఉన్నందున పేదలు, స్థోమత లేనివారు విద్యుత్తు కనెక్షన్లు తీసుకోలేక పోయారనీ, ఆ అడ్డంకిని తొలగించడానికే ప్రభుత్వం సౌభాగ్యను తీసుకొచ్చిందని ఎఫ్‌ఏక్యూలలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి సౌభాగ్య కింద 200 నుంచి 300 వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు పరికరాలను కూడా అందిస్తామంది.

మరిన్ని వార్తలు