గల్వాన్‌ లోయలో కీలక పరిణామం

6 Jul, 2020 12:34 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్‌ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్‌ లోయ, సహా హాట్‌స్ప్రింగ్స్‌, లద్దాఖ్‌ ప్రాంతాల నుంచి నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరున్నర మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. కాగా డ్రాగన్‌ దొంగదెబ్బకు భారత్ ధీటుగా స్పందిస్తుండటంతో వెనక్కి తగ్గిన చైనా ఈ మేరకు జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే బలగాల ఉపసంహరణలో చైనా ఎంతమేరకు నిజాయితీగా వ్యవహరిస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడక తప్పదని అభిప్రాయపడ్డాయి.(గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?)

కాగా తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ జూన్‌ 15న దాడికి తెగబడిన విషయం తెలిసిందే. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి భారత సైనికులను దొంగదెబ్బ కొట్టారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్- చైనా మధ్య వివిధ స్థాయిల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపిన విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడుతూనే.. విస్తరణ వాదానికి కాలం చెల్లిందంటూ చైనాను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇక సరిహద్దుల్లో చైనా తీరును విమర్శించిన అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ తదితర దేశాలు భారత్‌ మద్దతు పలికిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు