కేజ్రీవాల్‌ కేబినెట్‌: వారిద్దరికి ఛాన్స్‌ లేనట్లే!

12 Feb, 2020 18:29 IST|Sakshi

కేజ్రీవాల్‌ కేబినెట్‌లో కొత్త ముఖాలకు చోటు లేనట్లే!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై మూడోసారి కొలువుదీరనున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. తన కేబినెట్‌లో ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే ఈ దఫా కూడా మంత్రులుగా కొనసాగుతారని వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మరోసారి అఖండ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ పిలుపు మేరకు ఆప్‌ ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ శాసన సభాపక్షనేతగా ఎన్నుకున్నారు.

చదవండి: ఆప్‌.. మళ్లీ స్వీప్‌

కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్‌ 62 స్థానాలు కైవసం చేసుకోగా.. బీజేపీ కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే చతికిలపడింది. ఈ క్రమంలో ఆప్‌ ఘన విజయంలో కీలకంగా వ్యవహరించిన మహిళా ఎమ్మెల్యే అతిషిని.. కేజ్రీవాల్‌ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అదే విధంగా యువ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దాకు కూడా మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి. వీరి కోసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే... గతంలో కేజ్రీవాల్‌ కేబినెట్‌లో ఉన్న మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌, గోపాల్‌ రాయ్‌, ఖైలాశ్‌ గెహ్లోత్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, రాజేంద్రపాల్‌ గౌతం.. మరోసారి మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నట్లు తాజా సమాచారం. 

మరిన్ని వార్తలు