కూంబింగ్‌కు వెళ్లి అడవిలో చిక్కుకున్న ఎస్పీ

18 Jul, 2013 05:15 IST|Sakshi

మల్కన్‌గిరి, న్యూస్‌లైన్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ అఖిలేష్ సింగ్ మంగళవారం కూంబింగ్‌కు వెళ్లి తిరిగి రాకపోయిన ఉదంతం సుఖాంతమైంది. ప్రత్యేక దళాల సాయంతో బుధవారం ఆయన తిరిగి ఇక్కడకు చేరుకోవడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో మావోయిస్టు అగ్రనేతలు ఒడిశా వైపు వచ్చారని పోలీసులకు సమాచారమందింది. దీంతో మంగళవారం ఉదయం విశాఖపట్నం-మల్కన్‌గిరి జిల్లాల సరిహద్దులో ఉన్న టేకుగుడ అడవుల్లో ఎస్పీ అఖిలేష్‌సింగ్ తన బృందంతో కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగి ఓ జవాను గాయపడ్డాడు.

 

దీంతో జవానును తీసుకుని ఒక బృందం తిరిగి వచ్చింది. తర్వాత ఎస్పీ ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగించిన బృందం అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో పోలీసు అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎస్పీ బృందం నుంచి ఫోన్ రావడంతో వారంతా క్షేమంగా ఉన్నారని తెలిసి, వారిని తీసుకురావడానికి ప్రత్యేక దళాలను పంపారు. అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో సురక్షితంగా ఉన్న ఎస్పీ అఖిలేష్ సింగ్‌ను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు.
 

>
మరిన్ని వార్తలు