ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో బీజేపీకి ఎసరు

5 Mar, 2018 15:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థి అయిన సమాజ్‌వాది అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని, అందుకని తాము అభ్యర్థులను నిలబెట్టడం లేదని మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ ఆదివారం చేసిన ప్రకటన సంచలనం సష్టించింది. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా  ఈ రెండు పార్టీలు ఓ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు బయల్దేరాయి.

అబ్బే! అలాంటిదేబీ లేదంటూ ఆదరాబాదరగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి బీఎస్పీ నాయకురాలు మాయావతి స్పష్టం చేశారు. యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు తాము మద్దతిస్తుంటే అందుకు బదులుగా ఏప్రిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఎస్పీ మద్దతిస్తుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం కుదుర్చుకున్న అవగాహనకు, 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తము రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణపై ఆమె గత జూలై నెలలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ఖాళీ అయిన స్థానానికి ఆమెనే ఈసారి కూడా పోటీ చేయనున్నారు. 

లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతున్నప్పటికీ సమాజ్‌వాది, బీఎస్పీ పార్టీలు ఓ అవగాహనకు రావడం అన్నది విశేషమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోనంటూ వస్తున్న మాయావతి ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారని వారన్నారు. మాయావతి తన ఆధ్వర్యంలో ఎప్పుడూ రాష్ట్రంలో ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. కానీ ఆమె రాజకీయ గురువు కాన్షీరామ్‌ 1993లో రామజన్మ భూమి ఉద్యమం జోరుగా జరుగుతున్న సమయంలో బీఎస్పీ, ఎస్పీల మధ్య పొత్తు కుదుర్చడం ద్వారా బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. ‘మిలే ములాయం, కాన్షీరామ్‌ హవామే ఉడ్‌ గయే జై శ్రీరామ్‌’ నినాదం బాగా పనిచేసింది. అయితే నాటి బంధం రెండేళ్లకు మించి నిలబడలేక పోయింది. 1995లో మాయావతి, ములాయం సింగ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సహాయంతో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

మాయావతి ఇప్పుడు రెండు కారణాల వల్ల ఎస్పీతో పొత్తుకు ముందుకు వచ్చినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  2017లో 403 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీకి కేవలం 17 సీట్లు రావడంతో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలన్న సంకల్పం, నాడు తనను అవమానించిన ములాయం సింగ్‌ యాదవ్‌ ఇప్పుడు ఎస్పీ క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉండడం కారణాలని భావిస్తున్నారు. ఇలంటి అవగాహనతో 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే బీజేపీని ఓడించ వచ్చని వారంటున్నారు. 

మరిన్ని వార్తలు