సీఏఏపై ఉద్ధవ్‌ ఠాక్రేకి ఎస్పీ నేత హెచ్చరిక

22 Feb, 2020 13:58 IST|Sakshi

ముంబై: పౌరసత్వ సరవణ చట్టం(సీఏఏ), ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను మహారాష్ట్రలో అమలుచేయవద్దని ఎస్పీ నేత అబూ అజ్మీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను హెచ్చరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు సీఏఏపై వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లుగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఏఏ ముస్లింల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని అబూ అజ్మీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్‌కు అనుమతి ఇస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌లను మహారాష్ట్రలో అమలు చేయవద్దని అభ్యర్థించారు. (కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది: ఉద్ధవ్‌ ఠాక్రే)

కాగా మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మద్దతుతో అధికారంలోకి  వచ్చిన విషయం తెలిసిందే. కాగా, సీఏఏ అమలుకు మద్దతు తెలిపిన శివసేన.. ఎన్నార్సీని వ్యతిరేకిస్తామనడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ మధ్య తేడాలను పరిశీలించాలని, ఎన్‌పీఆర్‌ను స్వాగతిస్తే.. ఎన్‌ఆర్‌సీని ఆపటం సాధ్యం కాదని కాంగ్రెస్‌నేత మనోజ్‌ తివారీ అన్నారు. రాజ్యాంగ పరంగా సీఏఏను సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ లౌకికపరంగా చూస్తే ఈ చట్టాన్ని ఆమోదించలేమని ఆయన తెలిపారు. ఇక శుక్రవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షాలతో భేటీ అయిన అనంతరం సీఏఏపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొనడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

>
మరిన్ని వార్తలు