దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం: కేంద్ర మంత్రి గెహ్లాట్‌

20 Jan, 2018 16:04 IST|Sakshi

సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్‌): కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రిగా మూడున్నరేళ్లుగా ఆనందంగా పనిచేస్తున్నానని, తన శాఖలో మూడు గిన్నిస్ రికార్డులు రావడం గర్వకారణంగా ఉందని తావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల హక్కుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. ఇక్కడి త్యాగరాయ గానసభలో వికలాంగుల హక్కుల చట్టం-2016 పై శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 21 కేటగిరీలను చట్టంలోకి తెచ్చిన ఘనత తమదేనని, 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచామని, కళాశాలల్లో చేరికల కోసం 5 శాతం రిజర్వేషన్‌ను తమ ప్రభుత్వమే మొదలు పెట్టిందని వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఇస్తే సంతోషమని అన్నారు. వికలాంగుల గుర్తింపు కార్డులు జిల్లాస్థాయిలో మాత్రమే కాదు దేశమంతా చెల్లుబాటయ్యేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక్క స్కూల్ అయినా ప్రారంభించిందా అని నిలదీశారు. 10 లక్షల మంది దివ్యాంగులలో 4 లక్షల మందికి మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. మెట్రో రైలులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు కేంద్రం అమలు జరిపే పథకాలపై అవగాహన కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు త్వరలో వికలాంగుల హక్కుల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాములు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు