ఈఏపీ రూపంలో ఏపీకి ప్రత్యేక సాయం

16 Mar, 2017 04:04 IST|Sakshi

- కేంద్ర మంత్రివర్గం ఆమోదం 
- పోలవరం ఖర్చు చెల్లించేందుకు అంగీకారం


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయాన్ని ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌(విదేశీ రుణ సాయం) ప్రాజెక్టుల(ఈఏపీ) రూపంలో అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును చెల్లించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక సాయాల అమలుపై మార్గదర్శకాలను కేబినెట్‌ ఆమోదించింది.

ఈఏపీల ద్వారా..: 2015–16 నుంచి 2019–20 మధ్య కాలంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా భరించి ఉంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో ఆ మేరకు ప్రయోజనం కలిగేలా ఏపీకి ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటన చేశారు. 2015–16 నుంచి 2019–20 మధ్య కాలంలో ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మేరకు రుణ చెల్లింపు కోసం కేంద్రం ప్రత్యేక సాయం చేస్తుందన్న ఆర్థిక శాఖ ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది.

నాణ్యత బాధ్యత పోలవరం ప్రాజెక్టు అథారిటీదే: పోలవరం ప్రాజెక్టుకు 01.04.2014 నాటి వరకు ఉన్న అంచనా వ్యయం ప్రకారం ఆ తరువాత వెచ్చించే వ్యయంలో నీటి పారుదల పద్దు కింద అయ్యే ఖర్చును 100 శాతం భరించేందుకు ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 01.04.2014 నాటికి సాగునీటి పద్దు కింద ఉన్న అంచనా వ్యయాన్ని లెక్కకట్టడంలో కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అమలు చేస్తుంది. అయితే సమన్వయం, నాణ్యత, డిజైన్‌ అంశాలు, పర్యవేక్షణ, అనుమతులు తదితరు అంశాలను కేంద్ర జల వనరుల శాఖ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చూస్తుంది.

మరిన్ని వార్తలు