24 మంది దోషులు.. 36 మంది నిర్దోషులు

3 Jun, 2016 08:33 IST|Sakshi
24 మంది దోషులు.. 36 మంది నిర్దోషులు

* గుల్బర్గ్ ఊచకోత కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు  
* అందరిపై కుట్ర అభియోగాలు కొట్టివేత

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 14 ఏళ్ల నాటి గుల్బర్గ్ నరమేధం కేసులో ప్రత్యేక కోర్టు 24 మందిని దోషులుగా తేల్చింది. గోద్రా అల్లర్ల మరుసటి రోజు జరిగిన ఈ ఊచకోత కేసులో కోర్టు 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అందరిపైనా కుట్ర అభియోగాలను తొలగించింది. ఈనెల 6న దోషులకు జడ్జి శిక్ష ప్రకటించనున్నారు. 2002లో గుజరాత్‌లో జరిగిన ఈ ఊచకోత ఘటనలో నాటి కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మంది బలయ్యారు.

అప్పుడు జాఫ్రీని దుండగులు బయటకు ఈడ్చుకొచ్చి కిరాతకంగా చంపి తగులబెట్టారు. జాఫ్రీ భార్య జకియా 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్నప్పటికీ తనకు జరిగిన అన్యాయంపై అలుపెరగకుండా పోరాడారు.
 
66 మంది నిందితులు
దర్యాప్తు సంస్థ ‘సిట్’ ఈ కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొనగా ఆరుగురు విచారణ దశలో మరణించారు. 24 మంది దోషుల్లో 11 మందిని ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్ గురువారం ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) కింద దోషులుగా నిర్ధారించారు. మిగిలిన 13 మందిపై చిన్నపాటి నేరాలను నిర్ధారించారు. నిర్దోషులుగా తేలిన వారిలో సిట్టింగ్ బీజేపీ కార్పొరేటర్ బిపిన్ పటేల్, గుల్బర్గ్ సొసైటీ ఏరియా ఇన్‌స్పెక్టర్ కేజీ ఈర్దా, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ మేఘ్‌సింగ్ చౌదరీ  తదితరులు ఉండగా, తేలికపాటి నేరాలు రుజువైన వారిలో వీహెచ్‌పీ నాయకుడు అతుల్ వైద్య తదితరులున్నారు.

దోషుల్లో 11 మందికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరే అవకాశం ఉండగా, దోషుల తరఫు న్యాయవాదులు మరణించేవరకు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరే అవకాశముంది. మిగిలిన 13 మందికి 10-12 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారించింది. ఊచకోత ముందస్తు ప్రణాళిక మేరకు పన్నిన కుట్రే అని నమోదుచేసిన అభియోగాలను సిట్ దానిని నిరూపించలేకపోయింది. దర్యాప్తునకు నేతృత్వం వహించిన సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్‌కే రాఘవన్ తీర్పుపై మిశ్రమ అభిప్రాయం వ్యక్తంచేశారు. తీర్పుపై సవాల్‌చేసే విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామన్నారు.
 
హత్యానేరం కింద దోషులు: కైలాశ్ దోబీ, యోగేంద్రసింగ్ షెకావత్, క్రిష్ణ కుమార్ కలాల్, దిలీప్ కలు, జయేశ్ పర్మర్, రాజు తివారీ, నరన్ తంక్, లఖన్‌సింగ్ చుడాసమా, దినేశ్ శర్మ, భరత్ బలోడియా, భరత్ రాజ్‌పుత్. బాధిత కుటుంబాల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దర్యాప్తు కోసం సిట్‌ను నియమించింది.
 
పోరాటం ఆగుతుందనుకున్నా: జకియా
కోర్టు తీర్పుపై జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘నిందితులు తాము చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి.   వారంతా నా కళ్లముందే ఎంతోమందిని కిరాతకంగా చంపేశారు.’ అని జకియా మీడియాకు చెప్పారు. ఈ రోజుతో తన పోరాటం ముగిసిపోతుందని అనుకున్నానని, అయితే ఈ తీర్పుతో పోరాటం కొనసాగించక తప్పదన్నారు.
 
మోదీకి కళంకం: మాజీ న్యాయమూర్తి
ఊచకోత నాడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారని, ఈ తీర్పు మోదీకి కళంకితమని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజిందర్ సచార్ అన్నారు.

మరిన్ని వార్తలు